Business

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణిస్తుండడం విశేషం. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 133 పాయింట్ల లాభంతో 66,398 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 35 పాయింట్లు లాభపడి 19,762 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం కూడా నష్టాలతో ముగిశాయి. అక్కడి టెక్‌ స్టాక్స్‌లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. యాపిల్‌ షేరు మూడు శాతానికి పైగా నష్టపోయింది. చైనాలో ప్రభుత్వ కార్యాలయాలు సహా అధికారిక ప్రదేశాల్లో ఐఫోన్ల వినియోగాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించడం యాపిల్‌ షేర్ల పతనానికి కారణమవుతోంది. ఐరోపా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ఉన్నాయి. దేశీయంగా డిఫెన్స్‌, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ రాణించే సూచనలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. అయితే, రూపాయి పతనం, చమురు ధరలు మదుపర్లను ఒకింత కలవరానికి గురిచేస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) గురువారం రూ.758.55 కోట్ల విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.28.11 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఒడిశాలో గ్రీన్‌ హైడ్రోజన్‌, అమ్మోనియా తయారీ ప్లాంట్ల ఏర్పాటు కోసం టాటా స్టీల్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌.. అవాడా గ్రూప్‌తో జతకట్టింది. అమెరికా ప్రభుత్వంతో మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ ‘మాస్టర్‌ షిప్‌ రిపైర్‌ అగ్రిమెంట్‌’ కుదుర్చుకుంది. రైట్స్‌ ఇష్యూ ద్వారా తమ అనుబంధ సంస్థ ‘ఎక్సైడ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌’లో రూ.100 కోట్లు పెట్టుబడిగా పెట్టే యోచనలో ‘ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌’ ఉన్నట్లు సమాచారం. దక్షిణ కరోలినాలో కనెక్టివిటీ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం కోసం అక్కడి బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసెస్‌ సంస్థ ట్రువిస్టాతో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల స్టాక్స్‌పై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.