విశాఖ ఆరే బీచ్‌లో ఇసుక నల్లగా మారింది. ఇలా రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తుండగా, అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇసుకలో ఉండే లైట్,హెవీ మినరల్స్ విడిపోవడం వల్లే తీరం నల్లగా మారిందని అంటున్నారు. వాతావరణ మార్పులతో అలల ఉధృతి పెరిగినప్పుడు తీరంలో ఉండే లైట్ మినరల్స్ నీటితోపాటు సముద్రం లోపలకు వెళతాయట.
హెవీ మినరల్స్ తీరంలోనే ఉండిపోతాయట. బరువుగా ఉండే ఈ మినరల్స్‌లో ఎకువగా ఇలమనైట్, రుటైల్, జింకాన్, గార్నెట్, సిలిమినైట్ వంటివి ఉంటాయని చెబుతున్నారు. బీచ్ నల్లగా మారడానికి ప్రధానంగా ఇలమనైట్, రుటైల్ వంటి హెవీ మినరల్స్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు నల్లగా ఉండటం వల్లే తీరమంతా ఆ రంగులోకి మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. బీచ్‌లో ఇసుక రంగు నల్లగా మారడంతో పర్యాటకులతో పాటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రాంతం ఇలా కావడం చర్చనీయాంశమైంది. అయితే స్థానికులు మాత్రం విశాఖలో మొత్తం 10 ప్రాంతాల్లో డ్రైన్ వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అందుకే బీచ్ అందం మొత్తం పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో కూడా సరిగ్గా ఇలాగే సముద్ర తీరం మొత్తం నల్లగా మారిపోయింది.