శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథుడికి భక్తులు విరాళాలు సమర్పించారు. గతంతో పోలిస్తే ఐదురెట్లు అధికంగా విరాళాలు వచ్చాయని కాశీ విశ్వనాథ్ ధామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కుమార్ వర్మ పేర్కొన్నారు. శ్రావణ మాసంలో బాబా దర్బార్‌కు 1.63కోట్ల మందికిపైగా భక్తులు హాజరై రూ.16.89కోట్ల విరాళాలు అందించారని చెప్పారు. గతేడాదితో ఇదే సమయంలో 3.40కోట్లకుపైగా విరాళాలు అందాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఐదురెట్లు పెరిగాయన్నారు.
అయితే, కాశీ ఆలయాన్ని అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల తాకిడి సైతం పెరిగిందని సునీల్‌కుమార్ పేర్కొన్నారు. గతంలో ఆలయం 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయం ఉండగా.. దాన్ని 5లక్షల చదరపు అడుగుల మేర విస్తరించారు. సౌకర్యాలు పెరగడంతో కాశీ విశ్వనాథుడి దర్శనం భక్తులకు సులువైందని, ఈ క్రమంలో విరాళాలు సైతం పెరిగినట్లు ఆయన తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం తర్వాత ఆలయ ట్రస్ట్ సౌకర్యాలను పెంచింది. తాగునీరు, నీడ, తదితర మౌలిక వసతులకు ఏర్పాట్లు చేశారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.