Politics

ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ నిర్ణయం పై హైకోర్టులో పిల్

ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ నిర్ణయం పై హైకోర్టులో పిల్

ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్‌ విధానంపై రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలైంది. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరామ్‌ ప్రసాద్‌ దీన్ని దాఖలు చేశారు. కొత్త విధానం రిజిస్ట్రేషన్‌ చట్టాలకు వ్యతిరేకమని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. అనుభవం లేని వార్డు సెక్రటరీల ద్వారా రిజిస్ట్రేషన్‌ విధానం సరికాదన్నారు. శివరామ్‌ ప్రసాద్‌ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని (కార్డ్‌ ప్రైమ్‌ 2.0) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 15 తర్వాత ఆన్‌లైన్‌లో మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖ సన్నద్ధమవుతోందంటూ దస్తావేజు లేఖర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఓటీపీ విధానం అమలు, ఒరిజినల్‌ దస్త్రాలు ఇవ్వకుండా సాధారణ కాగితాలపై రిజిస్ట్రేషన్‌ జరుగుతుండటం పట్ల క్రయవిక్రయదారుల నుంచీ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల బ్యాంకుల నుంచి రుణాలు రావని, ఇతర సమస్యలు ఎదురుకావచ్చన్న సందేహాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిల్‌ దాఖలైంది.