Editorials

హైదరాబాద్- విజయవాడ హైవే పై రహదారి సమస్యలు

హైదరాబాద్- విజయవాడ హైవే పై రహదారి సమస్యలు

భారీ వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్డు.. విస్తరణ పనులు.. వెరసి హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. రహదారి విస్తరణ పూర్తయితే ప్రయాణం చాలా సాఫీగా మారే అవకాశమున్నా నిర్మాణ సమయంలో చిన్నపాటి తప్పిదాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. వర్షాలకు పడిన గుంతలు స్పీడ్‌ బ్రేకర్లను తలపిస్తున్నాయి. ఈ రహదారిని నగరంలోని చింతల్‌కుంట కూడలి నుంచి ఆందోల్‌మైసమ్మ (దండు మల్కాపూర్‌) వరకూ 6 వరుసల మేర విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 22.5 కిలోమీటర్ల మేర పనుల్ని రూ.541 కోట్లతో చేపడుతున్నారు. ప్రస్తుతం పెద్దఅంబర్‌పేట, బాటసింగారం, ఇనామ్‌గూడ దగ్గర పైవంతెనల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా సర్వీసు రోడ్లు ముందు పూర్తి చేసి వాటి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. అయితే ఈ మళ్లించే చోట రోడ్లు ఇరుకుగా ఉండడంతో అప్పటివరకూ వేగంగా వచ్చే వాహనాలు నెమ్మదించాల్సి వస్తోంది. దాంతో ఒక్కసారిగా బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం జంక్షన్‌ (భూదాన్‌ పోచంపల్లికి వెళ్లే మార్గం), కొయ్యలగూడెం, చౌటుప్పల్‌ దగ్గర సమస్య తరచూ వస్తోంది.

వాహనం మొరాయిస్తే ఇక బారులే బారులు…ఈ మార్గంలో పైవంతెనల నిర్మాణం జరిగే చోట చిన్న ప్రమాదం జరిగినా.. ఏదైనా వాహనం మరమ్మతుకు గురై నిలిచిపోయినా సమస్య పెద్దగా మారుతోంది. చౌటుప్పల్‌, చిట్యాల, నకిరేకల్‌, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఉద్యోగ ఇతర అవసరాల కోసం నిత్యం వెళ్లేవారు శివార్లలోని కళాశాలల విద్యార్థులు సాయంత్రం తిరుగు ప్రయాణమవుతుంటారు. ఈ కారణంగా మిగతా సమయాలతో పోలిస్తే సాయంత్రం 5 తర్వాత రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆ సమయంలో చిన్న ప్రమాదం జరిగినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. పెద్దఅంబర్‌పేట దగ్గర పనులు చేపట్టే ప్రాంతంలో స్థానికులు రోడ్డు దాటేందుకు యూటర్న్‌లు దూరంగా ఉన్నాయి. దీంతో స్థానిక ద్విచక్ర, ఇతర చిన్న వాహనాల వారు కొంతమంది రాంగ్‌రూట్లో ప్రయాణిస్తున్నారు. ఇలాంటివీ సాఫీగా సాగాల్సిన ట్రాఫిక్‌కు ఆటంకంగా పరిణమిస్తున్నాయి.

చీకటి పడితే…పెద్దఅంబర్‌పేట నుంచి కొత్తగూడెం దాకా హెచ్‌ఎండీఏ ప్రధాన రహదారిపై గతంలో వీధి దీపాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పనుల దృష్ట్యా విస్తరణ జరిగే ప్రాంతంలో వీటినితొలగించడంతో సాయంత్రం దాటితే ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. రహదారిపై మలుపు తీసుకుని కొత్తగా ఏర్పాటు చేసిన సర్వీసు రోడ్డులోకి ప్రవేశించే దగ్గర చీకట్ల కారణంగా.. వాహనాలు సిమెంటు దిమ్మెలు, బారికేడ్లను ఢీకొంటున్నాయి. జాతీయ రహదారిపై డైవర్షన్లకు సంబంధించి ముందస్తుగానే వాహనదారులకు తెలిపి అప్రమత్తం చేసేలా సూచికలు పూర్తిస్థాయిలో లేవు.

ఇవి పాటిస్తే మేలు…

* రహదారి నిర్మాణం చేపట్టే ప్రాంతాలను ట్రాఫిక్‌ సిబ్బంది పర్యవేక్షించాలి.

* ప్రధాన రహదారి నుంచి సర్వీసు రోడ్డుకు మళ్లే చోట రోడ్డు గుంతలుగా లేకుండా చూడాలి.

* రద్దీ ఎక్కువగా ఉండే సాయంత్రం వేళలు, వారాంతాల్లో ట్రాఫిక్‌ సిబ్బంది వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తే కొంత మేలు.

* వాహనం రోడ్డుపై నిలిచిపోతే క్షణాల్లో తొలగించేలా ఏర్పాట్లు ఉండాలి.