కీర్తి సురేశ్ లాంటి స్టార్ హీరోయిన్లు అలనాటి తారల బయోపిక్‌లలో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటీనటుల జీవిత చరిత్రల్లో ఇప్పటి హీరో-హీరోయిన్లు నటిస్తూ వాళ్ల పాత్రల్లో ఒదిగిపోతున్నారు. ఇప్పుడీ జాబితాలోకి తమన్నా (Tamannaah) చేరనున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు జీవిత చరిత్రలోనూ కనిపించనుందట. ఒకప్పటి బ్యూటీ క్వీన్ దివ్య భారతి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. మలయాళంలో ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో దివ్య భారతి పాత్ర కోసం తమన్నాను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా దివ్య భారతి ఒక వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుని ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులోనూ వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్‌బాబుల సరసన నటించారు. బ్యూటీ క్వీన్‌గా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న దివ్య భారతి 19 ఏళ్ల వయసులోనే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. తెలుగు, హిందీ భాషల్లో అలరించిన ఆమె జీవిత చరిత్రను మలయాళ ఇండస్ట్రీ తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండడం విశేషం. ఇక ఈ ప్రాజెక్ట్‌కు (Divya Bharti boipic) తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇందులో దివ్య భారతి మరణాన్ని ఎలా చూపుతారోనని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.