సుబ్రజ్యోతి రాయ్.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ బెంగాల్ యువకుడు ఎకోఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ రూపొందించాడు. కోల్‌కతాలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ విద్యార్థికి ఓ బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులు తాపత్రయపడేవారు. ఆ కుటుంబానికి అంత స్తోమత లేదు. దీంతో తానే ఓ బైక్‌ను తయారుచేసి తల్లిదండ్రులకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు సుబ్రజ్యోతి రాయ్. నగరంలోని ఆటోమొబైల్ మార్కెట్ నుంచి వివిధ పరికరాలు కొనితెచ్చి.. తనే సొంతంగా ఎలక్ట్రిక్ బైక్ తయారుచేశాడు. ఈ బైక్ నుంచి కొంచెం కూడా శబ్దం రాదు.. 40 నిమిషాల్లో పూర్తి ఛార్జింగు అవుతుంది. బైక్‌లో అమర్చిన ప్రత్యేక పరికరాలతో దీనిని ఎవరైనా అపహరించినా ఇట్టే తెలిసిపోతుందని సుబ్రజ్యోతి వివరించాడు.