తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 12న (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Tirumala Koil Alwar Thirumanjanam) నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 12న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా సెప్టెంబరు 11న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవనే విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది టీటీడీ. సంప్రోక్షణ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని టీటీడీ ప్రకటించింది. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో నిర్వహిస్తారు.
దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని.. ప్రజలందరికీ మంచి జరగాలనే సత్సంకల్పంతో శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం తలపెట్టామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద మహాశాంతి వరుణయాగంలో భాగంగా సెప్టెంబర్ 8న ఉదయం ఆచార్య రుత్విక్ వరణం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి అర్చకులకు పసుపు వస్త్రాలను బహూకరించారు.
అంకురార్పణ నిర్వహించి ఈ నెల 11వరకు ఇక్కడ యాగం నిర్వహిస్తామని చెప్పారు. నెల క్రితం తిరుమల ధర్మగిరిలో నిర్వహించిన వరుణయాగం వల్ల వర్షాలు బాగా కురిశాయన్నారు. ఈ సంవత్సరంతో పాటు, వచ్చే సంవత్సరం కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ నిపుణుల సూచనల నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం, వారికి సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ టీటీడీ ఈ యాగాన్ని నిర్వహిస్తోందని వివరించారు. ఈ యాగం ఎంతో కష్టసాధ్యమైందని, ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో యాగం జరగలేదని తెలిపారు.