దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liqour Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈడీ విచారణలో ఇప్పటికే ఆయన కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో అధికంగా సౌత్ గ్రూపునకు చెందిన వారే ఉండటం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ప్రస్తుతం వారంతా బెయిల్‌పై ఉన్నారు.
అప్రూవర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ పలువురిని ప్రశ్నిస్తోంది. రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ విచారణ కొనసాగిస్తోంది. హైదరాబాద్ నుంచి దిల్లీకి నగదు బదిలీపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20 మందిని ఈడీ ప్రశ్నించింది. ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల ఈడీ మరోమారు ప్రశ్నించింది. రానున్న రోజుల్లో మరికొంత మందిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్యాప్తును ఈడీ గోప్యంగా నిర్వహిస్తోంది.