* చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికే ఒక బ్లాక్‌డేగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపే అన్నారు. సీఎం చేసే చర్యలన్నింటికి ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తారన్నారు.
* రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఉత్తర్వులు. రోడ్డు మార్గం కాకుండా వాయు మార్గంలో తరలించాలని యోచన. విజయవాడ ఎయిర్‌పోర్ట నుంచి హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు తరలింపు. ఈ రాత్రికి సిట్ ఆఫీస్‌కి తెదేపా అధినేత చంద్రబాబు. రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. తెదేపా అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు
* భారత్ (India) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) ఇవాళ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) కీలక సూచన చేశారు. ప్రస్తుత సదస్సులో చేసిన సిఫార్సులు, తీర్మానాలను అంచనా వేయడానికి నవంబరు చివర్లో వర్చువల్ సమావేశం నిర్వహించాలని ఆయన సదస్సులో పాల్గొన్న దేశాధినేతలకు సూచించారు. నవంబరు 30 వరకు జీ-20కి భారత నాయకత్వమే కొనసాగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. బృంద అధ్యక్ష హోదాలో మరో రెండు నెలలు ఉండటం వల్ల మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయొచ్చని ఆయన అభిలషించారు.
* ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చనున్నారనే అంశంపై గత కొన్ని రోజులుగా దేశమంతటా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా.. దీనిపై పశ్చిమ బెంగాల్ (West Bengal) భాజపా ( BJP) నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) స్పందించారు. భారత్‌గా పేరు మార్చటాన్ని తప్పుపడుతున్న వారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పేరు మార్పును వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లవచ్చని అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన ‘ఛాయ్ పే చర్చా’ కార్యక్రమంలో దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్‌లో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే.. కలకత్తాలో వలస వాదానికి ప్రతీకగా నిలిచిన విదేశీ విగ్రహాలన్నింటినీ తొలగిస్తాం. భారత్ పేరు నచ్చని వారు దేశం వదిలి వెళ్లిపోవచ్చు’ అని అన్నారు.
* నగరంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే ఇళ్ల మరమ్మతులకు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హెచ్‌ఎండీఏ సమకూర్చిన ఈ నిధులతో జీహెచ్ఎంసీ మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. ‘‘ ఈ కాలనీల్లో మరమ్మతుల కోసం పేద ప్రజలు నిధులను వెచ్చించుకోలేరని ఎమ్మెల్యేలు కోరారు. అందుకే.. కొన్ని నిధులతో వేల సంఖ్యలో పేదలకు లబ్ధి చేకూరుతుందంటే ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడదు.
* భారత అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను అయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’కు సంబంధించి విజన్‌పై చేస్తోన్న కృషికి జీ20 ఓ వేదికగా మారడంతో నాకెంతో సంతృప్తి లభించింది’ అని సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
* భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సుపై (G20 Summit) కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ‘దిల్లీ డిక్లరేషన్’ (Delhi Declaration)పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడంతో భారత్ చేసిన కృషిని కొనియాడారు. ఇది భారత్‌కు ఎంతో గర్వకారణమన్న ఆయన.. మన దేశం తరఫున షెర్పాగా ఉన్న అమితాబ్ కాంత్ పాత్రను అభినందించారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా దిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో శశిథరూర్ (Shashi Tharoor) ఈ విధంగా స్పందించారు.
* 14 ఏళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు (Chandrababu)ను అర్ధరాత్రి అరెస్టు చేయటం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ (CPI Narayana) అన్నారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో జన సేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా భాజాపా కుటిల నీతిని తెలుసుకోవాలన్నారు.
* నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మలక్‌పేట, ముసారాంబాగ్, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్‌నగర్,ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారనంగా చాదర్‌ఘాట్ నుంచి ఎల్బీనగర్‌వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అప్రమత్తమయ్యారు. అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
* జీ20 సదస్సులో న్యూదిల్లీ డిక్లరేషన్ ద్వారా రష్యాను ఒంటరి చేయడాన్ని ధ్రువీకరించారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ (Emmanuel Macron) పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సదస్సు ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పు పట్టారు. జీ20 నాయకులు సమష్టిగా డిక్లరేషన్‌ను అంగీకరించిన మర్నాడే మెక్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘శాంతి, ఐకమత్యం కోసం ప్రధాని మోదీ మాటలకు ధన్యవాదాలు. రష్యా ఇప్పటికీ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది.. జీ20 మొత్తం ఉక్రెయిన్‌లో శాంతికి కట్టుబడి ఉంది. ఐరాస ఛార్టర్‌కు అనుగుణంగా నేను ఈ మాటలు నొక్కి చెబుతున్నాను’’ అని మెక్రాన్ రిపోర్టర్లకు వెల్లడించారు.
* చంద్రబాబు (Chandrababu)కు వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయారని మాజీ మంత్రి ఆలపాటి రాజా (Alapati Raja) పేర్కొన్నారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు వారు చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు. ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించడం కోసమే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందంటూ మండిపడ్డారు.