Kids

తోబుట్టువులు ఉండటం ఆర్థికంగా కూడా మంచిదే!

తోబుట్టువులు ఉండటం ఆర్థికంగా కూడా మంచిదే!

‘పిల్లాపాపలతో చల్లగా ఉండండి’ అనే దీవెనకు కాలదోషం పట్టిందేమో! ఈ తరం దంపతులు ఎవరైనా ఒకరే చాలు అని బలంగా ఫిక్సవుతున్నారు. ఇంట్లో పెద్దలు నచ్చజెబుతున్నా.. ఆ టాపిక్‌ రాగానే ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు!! గట్టిగా అడిగితే.. ‘ఇవి మీ పాత రోజులు కాదు! ఇప్పుడున్న ధరలతో ఒక్కరిని పోషించడమే కష్టం.. ఇంకో బిడ్డ అంటే మావల్ల కాదు’ అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మానవీయ బంధాల విషయంలో లెక్కలు వేసుకుంటే.. మీ బిడ్డకు ఆస్తి కూడబెట్టి ఇవ్వగలరేమో కానీ, అందమైన జీవితాన్ని దూరం చేసినవారు అవుతారని గుర్తుంచుకోండి.

ఎందుకు ఒక్కబిడ్డ చాలు అనుకుంటున్నారు? ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఈ ప్రశ్న ఉదయించిన ప్రతిసారీ పక్కాగా సమాధానమూ వస్తున్నది. ‘ఈ రోజుల్లో ఒక్కరిని పోషించడమే గగనం’ ఓ తండ్రి మాట! ‘మళ్లీ కాన్పు అంటూ మరో ఏడాది ఇంట్లో కూర్చుంటే నా కెరీర్‌ ఏం కాను’ అంటుంది తల్లి.

‘నర్సరీకే రెండు లక్షలు డొనేషన్‌ కట్టాల్సి వస్తుంది!’ అని దంపతులిద్దరూ ఒక్కరుంటే చాలు అని బలంగా వాదిస్తున్నారు. కారణం ఉద్యోగ అభద్రత! లక్షల్లో వేతనం అందుకుంటున్నా.. ప్రైవేటు ఉద్యోగంలో ఎప్పుడు వేటు పడుతుందో తెలియని పరిస్థితి. అమెరికాలో మాంద్యం వస్తే.. ఇక్కడ కొలువు ఊడిపోతుందని భయం. పోనీ, బాగా సంపాదించే రోజుల్లో ఆస్తులు కూడబెట్టారా అంటే అక్కడా సంతృప్తికరమైన సమాధానం రాదు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేలా పెరుగుతున్న ధరలు అంటూ కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు.

ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి నెలకు రూ.5 లక్షలు సంపాదించినా.. అవసరానికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఈ ధోరణే నేటితరం తల్లిదండ్రులు ఒక్కరే ముద్దు అనుకునేలా చేస్తున్నది. నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచన మంచిదే! అందుకోసం పిల్లలు వద్దనుకోవడం సరైన నిర్ణయం కాదు. జీవితంలో అన్నిటినీ డబ్బులతో ముడిపెట్టలేం. ఆదాయ మార్గాలు పెంచుకోవడంతోపాటు ప్రణాళికా బద్ధంగా సాగితే ఇద్దరు పిల్లలు భారం కారు. పిల్లల మధ్య మూడు, నాలుగేండ్లు వ్యత్యాసం ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. దీనివల్ల చదువు, పెండ్లి, సెటిల్‌మెంట్‌ వరకు అన్ని సందర్భాల్లోనూ ఈ వ్యత్యాసం తల్లిదండ్రులు ఆర్థికంగా ఊపిరి తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఉన్నత చదువులు, పెండ్లి సమయాల్లో డబ్బు సమకూరేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే ఒత్తిడి ఉండదు!

ఒకరికొకరు పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా.. తోడు ఇవ్వడం అత్యంత ఆవశ్యకం. తోబుట్టువును మించిన ఆస్తి మరొకటి ఉండదు. తోబుట్టువు లేని బాల్యం నిస్తేజంగా సాగుతుంది. తల్లిదండ్రులు ఎంత స్నేహితుల్లా ఉన్నా.. అన్నతోనో, చెల్లితోనో గడిపే సమయం చాలా గొప్పది. కాస్త పెద్దయ్యాక చదువు, కెరీర్‌ విషయంలో ఒకరి కొకరు మార్గనిర్దేశనం చేసుకుంటారు. తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుతో పంచుకుంటారు. అంతేకాదు, అన్నదమ్ములే కానీ, అక్కాతమ్ముళ్లే కానీ, అన్నాచెల్లెళ్లే కానీ ఒకరి విషయంలో మరొకరు బాధ్యతగా ఫీలవుతారు. ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటారు. అన్నిటికీ మించి ఒంటరి బతుకు అనే భావన రాకుండా తనకంటూ ఒకరున్నారన్న భావన ఎంతటి ఒత్తిడిని అయినా జయించేలా చేస్తుంది. తోబుట్టువు ఉంటేనే పంచుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది. భావోద్వేగాలను ఎవరితో ఎలా పంచుకోవాలో అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఆర్థికంగా భారమవుతుందనీ, కెరీర్‌ రేస్‌లో వెనుకబడతామనీ ఒక్కరితో చాలు అనుకుంటే పొరపాటే! ఆ బిడ్డకు మంచి చదువు, ఐశ్వర్యం ఇవ్వగలరేమో కానీ, అందమైన బాల్యాన్ని దూరం చేసినవాళ్లు అవుతారు. మీ తదనంతరం మీ వారసుడి కుటుంబం ఒంటరిగా మిగిలిపోవద్దు అనుకుంటే.. చిన్నప్పుడే తోబుట్టువును కానుకగా ఇవ్వండి.