తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహిస్తారని చెప్పారు. సెప్టెంబరు 12న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారని అన్నారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని వివరించారు. అనంతరం ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తులను దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఈ కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసినట్లు పేర్కొన్నారు .
మంగళవారం తిరుమలలో ఆలయ శుద్ధి
Related tags :