Politics

కాంగ్రెస్ హామీ కార్డులు పంపిణీ చేస్తాం

కాంగ్రెస్ హామీ కార్డులు పంపిణీ చేస్తాం

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచాక అమలుచేసే 5 ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని ఈ నెల 17న తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి బహిరంగ సభలో సోనియాగాంధీ విడుదల చేస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో ఆదివారం సాయంత్రం జూమ్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాస్కీ తదితరులు పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 17న బహిరంగసభ పూర్తయ్యాక 18వ తేదీ ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు చేరుకుంటారని వెల్లడించారు. స్థానిక నేతలు వారితో కలిసి 5 హామీల గ్యారంటీ కార్డులను ఇంటింటికీ అందజేయాలని తెలిపారు. తరువాత అన్ని నియోజకవర్గాల్లో మీడియా సమావేశాలు పెట్టి హామీలను వివరించాలని సూచించారు.