Politics

భాజపా ఒక విషసర్పం-తాజావార్తలు

భాజపా ఒక విషసర్పం-తాజావార్తలు

* సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన DMK నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈ సారి ఆయన భాజపాను విష సర్పంతో పోల్చారు. ఆదివారం తమిళనాడులోని నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్‌ ఇంట జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

* తెదేపా అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ రెండు పిటిషన్‌లు దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ వేయగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేసింది.

* స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని కోర్టుకు వివరించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని తెలిపారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. రాజమహేంద్ర కేంద్రకారాగారంలో 50 అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల.. చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని కోరారు.

* తెదేపా అధినేత చంద్రబాబు అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను దారుణమని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ హర్షకుమార్‌ తెలిపారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్దకు వచ్చి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హర్షకుమార్‌ మీడియాతో మాట్లాడారు.

* ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ప్రతీకార చర్యలో భాగంగానే ఆయన్ను అరెస్టు చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఐదేళ్ల తర్వాత విదేశీ పర్యటకు వెళ్తున్న సందర్భంగా.. పలు అంశాలపై దీదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

* ప్రముఖ సంగీత దర్శఖుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ కాన్సర్ట్‌లో నిర్వహణ లోపంతో వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై సోషల్‌మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాలతోపాటు మనదేశంలోనూ తరచూ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌ ఇస్తుంటారు రెహమాన్‌. ఇందులో భాగంగా చెన్నైలో గత నెల 12న సంగీత కార్యక్రమానికి ఏర్పాట్లు చేయగా.. వర్షం కారణంగా రద్దైంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ అభిమాన సంగీత దర్శకుడి పాటలను లైవ్‌లో వినొచ్చని ఆనందంతో అక్కడికి వెళ్లినవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సీట్లు లేక, పార్కింగ్‌ సౌకర్యం సరిగ్గా లేక చాలా మంది అవస్థలు పడ్డారు. గోల్డ్‌ పాసులు ఉన్నప్పటికీ కొంతమందిని అనుమతించలేదు. దీంతో చాలామంది అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్‌ ఇబ్బందులు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ విషయంపై అసహనం వ్యక్తం చేసిన పలువురు నెటిజన్లు.. సోషల్‌మీడియా వేదికగా నిర్వాహకులను తిడుతూ పోస్టులు పెడుతున్నారు. డబ్బులు తీసుకున్నప్పుడు ఏర్పాట్లు సరిగ్గా చేయడం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.

* గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ దుర్గ గుడి కేశ ఖండన శాల సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దుర్గ గుడి అధికారులు ప్రత్యేక క్రేన్‌లు తెప్పించి రోడ్డుపై పడిన కొండ రాళ్లను తొలగిస్తున్నారు. సమీపంలోని సబ్‌వేను కూడా మూసివేశారు.

* తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. చంద్రబాబు అరెస్టు తరువాత పరిణామాలు, నిరసనలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమీక్షించారు. ముఖ్యనేతలు, పొలిట్ బ్యూరో సభ్యులతో ఇకపై చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ నేతల సూచనలు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా తదుపరి ప్రణాళికకు రూపకల్పన చేశారు.

* మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా చేపట్టిన బంద్ గుంటూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చంద్రబాబుకు మద్దతుగా జనసేన, ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో తెదేపా బంద్‌ను అడ్డుకునేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.

* తెలంగాణ రాష్ట్రంలో కొన్నిచోట్ల సోమ, మంగళ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

* మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ను భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తప్పుబట్టారు. చంద్రబాబు అరెస్టు సబబు కాదన్నారు. ఈ మేరకు దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా పడింది. అనివార్య కారణాల నేపథ్యంలో వాయిదా వేయాలంటూ వివేకా కుమార్తె, పిటిషనర్‌ సునీత నర్రెడ్డి తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది.