పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం… ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం… రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు.
ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు.
జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు.
సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్‌లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.