DailyDose

ఏకంగా మంత్రినే మాయం చేసిన చైనా ప్రభుత్వం-నేరవార్తలు

ఏకంగా మంత్రినే మాయం చేసిన చైనా ప్రభుత్వం-నేరవార్తలు

* చైనా ప్రభుత్వం తనను ధిక్కరించిన వారిని కఠినంగా అణివేస్తుందనడానికి అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా అదృశ్యమే ఒక ఉదాహరణ. ఆయన కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయారు. కానీ ఇప్పుడు జిన్‌పింగ్ సొంత ప్రభుత్వంలోనే మంత్రులే కనిపించకుండా పోతున్నారు. మొన్నటికిమొన్న విదేశాంగ మంత్రి హోదాలో ఉండగానే చిన్‌గాంగ్ అదృశ్యమయ్యారు. ఆయన జాడ ఇప్పటికీ లేదు. తాజాగా రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్ఫు ఎక్కడికి వెళ్లిపోయారో స్పష్టత లేదు. రెండు వారాల క్రితం బీజింగ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా పీస్‌ అండ్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడిన తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు.

* సరిహద్దుల్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (ళ్త్ ఘెన్ ఊపెంద్ర డ్వివెది) వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ రైఫిల్‌ దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని ద్వివేది తెలిపారు. భారత్‌లో చొరబాటు కోసం పాక్‌ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని ద్వివేది ఆరోపించారు. భారత భద్రతా దళాల అప్రమత్తత కారణంగా వారి ఆటలు సాగడం లేదన్నారు. గత 9 నెలల్లో 46 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నారు. అందులో 37 మంది విదేశీయులు కాగా.. 9 మంది స్థానికులుగా గుర్తించామన్నారు. ఆర్థిక సంక్షోభం, ఇతర సమస్యలతో సతమతమవుతున్న పాక్‌.. భారత్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోందని విమర్శించారు. సరిహద్దులోని రాజౌరి, పూంఛ్‌ జిల్లాల్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఆయన ధ్వజమెత్తారు. విద్రోహ శక్తులు డ్రోన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని, కౌంటర్‌ డ్రోన్‌ టెక్నాలజీతో ఆ కార్యకలాపాలకు చెక్‌ పెడుతున్నామని వివరించారు.

* కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పామర్తి శిరీష భర్త బి.అశోక్‌(30) ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. అశోక్‌ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరఫు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సాయంత్రం ఈ సంఘటన జరిగితే మృతదేహాన్ని ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచారు. రాత్రి 10 గంటల వరకు దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఏలూరుకు చెందిన శిరీష గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బి.అశోక్‌ రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది కులాంతర వివాహం. ఏడాది వయసు గల ఒక కుమార్తె ఉంది. శిరీష మచిలీపట్నంలోని స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐగా పని చేస్తూ 4 నెలల కిందట నందివాడకు బదిలీపై వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరోవైపు ఇది హత్యేనని అశోక్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

* తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతిచెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న వెల్లూరు జిల్లాకు చెందిన 24 మంది పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఓ మినీ బస్సులో బయలుదేరి కర్ణాటక వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైన వారి వాహనం బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై మొరాయించింది. దాంతో ఆ వాహనాన్ని ఉదయం 3 గంటల ప్రాంతంలో తిరుపత్తూరు జిల్లా నట్రంపల్లి శివారులో పార్క్‌ చేశారు. దానికి మరమ్మతులు చేస్తుండగా బస్సులోని మహిళలు కిందికి దిగి రోడ్డు పక్కనే కూర్చున్నారు. అంతలోనే వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొంది. దాంతో బస్సు రోడ్డుపై కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది.

* ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో దారుణం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన తన భార్యను భర్తే హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని బాత్‌రూంలో దాచి, తాను ఇంటి స్టోర్‌రూమ్‌లో తలదాచుకున్నాడు. బాధితురాలి సోదురుడు ఫోన్ చేసినప్పటికీ కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేణు సిన్హా(61), అజయ్ నాథ్‌లు భార్యభర్తలు. అజయ్‌ నాథ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌ మాజీ ఉద్యోగి. రేణు సిన్హ సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. వారు నోయిడాలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అయితే.. ఆ ఇంటిని అజయ్‌ నాథ్ రూ.4 కోట్లకు అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. అడ్వాన్స్ కూడా కొనుగోలుదారుని వద్ద తీసుకున్నాడు. కానీ బంగ్లా అమ్మడానికి రేణు సిన్హా అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అజయ్‌ నాథ్‌.. రేణు సిన్హాను హత్య చేశాడు.

* షాద్‌న‌గ‌ర్ ప‌రిధిలోని మోకిల వ‌ద్ద డ్ర‌గ్స్ ముఠాను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డ్ర‌గ్స్ ముఠా నుంచి 51 గ్రాముల కొకైన్, 44 గ్రాముల ఎక్‌స్టాసీ పిల్స్, 8 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వ‌ద్ద ఐదు మొబైల్స్, మూడు కార్లు, రూ. 97,500 న‌గ‌ద‌ను సీజ్ చేశారు. అరెస్టు అయిన వారిలో లింగంప‌ల్లి అనురాధ‌(34), సానికొమ్ము ప్ర‌భాక‌ర్ రెడ్డి(38), వెంక‌ట శివ‌సాయి కుమార్(33) ఉన్నారు. మంచిర్యాల‌కు చెందిన అనురాధ గ‌చ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. గోవా నుంచి ఓ వ్య‌క్తి డ్ర‌గ్స్ తీసుకొచ్చి, అనురాధ‌కు విక్ర‌యిస్తున్నాడు. గ‌చ్చిబౌలి డీఎల్ఎఫ్ వ‌ద్ద టిఫిన్ సెంట‌ర్ నిర్వ‌హిస్తున్న ప్ర‌భాక‌ర్ రెడ్డి ద్వారా త‌న స్నేహితుల‌కు అనురాధ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తోంది.