ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీనికి నెటిజన్ల నుండి ఆసక్తికరమైన ప్రశ్నలు వచ్చాయి.
‘చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడి గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి’ అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. దీంతో రాఘవేంద్ర రావు చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
బాబును అరెస్ట్ చేయడం వల్ల అంబేద్కర్ విగ్రహాలు బాధ పడడం సంగతేమో గానీ.. దివంగత ఎన్టీఆర్ విగ్రహాలు మాత్రం ఆనంద భాష్పాలు రాల్చుతున్నాయని రాఘవేంద్రరావుకు చెంప చెళ్లుమనేలా నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబును మాత్రం గారు అని సంబోధిస్తూ ట్వీట్ చేశావ్… మరి అదే ట్వీట్లో అంబేద్కర్ గారిని మాత్రం ‘గారు’ అని సంబోధించడానికి మాత్రం తమకు మనుసు రాలేదు కదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, ఆయన్ను ఘోరంగా అవమానించి పదవీచ్యుతుడిని చేసినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నీకు గుర్తు రాలేదా? అని రాఘవేంద్రరావును నెటిజన్లు నిలదీస్తున్నారు.