కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం పెద్ద గందరగోళం సృష్టించారు. ఆటోమొబైల్ ఉత్పత్తిదారులకు, వాహన కొనుగోలుదార్లకు, స్టాక్ మార్కెట్‌కు ఆందోళన మిగిల్చారు. మంత్రి ఉదయం ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సియామ్ సదస్సులో మాట్లాడుతూ కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు డీజిల్‌తో నడిచే వాహనాలపై అదనంగా 10 శాతం పన్ను వేస్తామంటూ ప్రకటించారు. డీజిల్ ఉపయోగించే వాహనాలపైనే కాకుండా ఆ ఇంధనంతో నడిచే జనరేటర్ సెట్స్‌పై కూడా అదనపు జీఎస్టీగా 10 శాతం కాలుష్య పన్ను విధించాలంటూ తాను ఆర్థిక మంత్రిని కోరతానన్నారు. అటుతర్వాత ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ లేదంటూ మాటమార్చారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) సదస్సులో మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ డీజిల్ వాహనాల్ని అమ్మడం కష్టతరమయ్యేలా ప్రభుత్వం పన్నుల్ని భారీగా పెంచుతుందన్నారు. దేశంలో ప్రస్తుతం అధికశాతం వాణిజ్య వాహనాలు డీజిల్‌తో నడుస్తున్నవే. పాసింజర్ వాహనాలకు సంబంధించి మారుతి సుజుకి, హోండాతో సహా వివిధ కంపెనీలు ఇప్పటికే డీజిల్ కార్ల తయారీని నిలిపివేశాయి. దేశంలో డీజిల్ కార్ల వాడకం గణనీయంగా తగ్గిందని, ఉత్పత్తిదారులు వాటిని మార్కెట్లో విక్రయించరాదని గడ్కరీ సూచించారు.
డీజిల్ వాహన యజమానులకు దడ పుట్టించిన గడ్కరీ
Related tags :