Business

నిలకడగా దేశీయ బంగారం ధరలు-వాణిజ్యం

నిలకడగా దేశీయ బంగారం ధరలు-వాణిజ్యం

* అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీయ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఫ్లాట్ గా కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం రూ.60 వేల వద్ద నిలకడగా కొనసాగుతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. కిలో వెండి ధర కూడా రూ.74,400 వద్దే నిలిచింది. ‘మంగళవారం బులియన్ మార్కెట్ ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ (24 క్యారట్లు) తులం బంగారం ధర రూ.60,000 వద్దే కొనసాగింది. నిన్నటి ముగింపు ధర యధాతథంగా కొనసాగింది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర స్వల్పంగా తగ్గి 1922 డాలర్లు పలికింది. ఆగస్టు యూఎస్ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఔన్స్ వెండి ఫ్లాట్‌గా 23.12 డాలర్ల వద్దే స్థిరంగా కొనసాగింది.

* మార్కెట్‌ ర్యాలీని ఆసరా చేసుకుని, మరో సంస్థలో వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకోసం కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) త్వరలో ఐపీవోకు రానుంది. ఈ కంపెనీలో కేంద్రం 26.88 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)గా విక్రయించేందుకు మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది.

* Yatra Online IPO | ప్రయాణ సేవలు అందించే యాత్ర ఆన్‌లైన్‌ సంస్థ ఐపీఓ (Yatra Online IPO) రానుంది. సెప్టెంబర్‌ 15 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి రానుంది. 20వ తేదీతో సబ్‌స్క్రిప్షన్‌ ముగియనుంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.135-142గా ధరల శ్రేణిగా కంపెనీ నిర్ణయించింది. అయితే లాట్‌ను మాత్రమే కొనుగోలు చేయాల్సివుంటుంది. యాత్ర ఐపీఓకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే కనిష్ఠంగా 105 ఈక్విటీ షేర్లకు (ఒక్కో లాట్‌కు) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద దాదాపు రూ.15వేలు చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐపీఓలో భాగంగా రూ.602 కోట్ల విలువైన 1.21 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కంపెనీ జారీ చేయనుంది. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ.775 కోట్లు కంపెనీకి సమకూరనున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. గత కొన్ని రోజుల లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్‌ లాభాల్లో.. నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ముగించాయి. మార్కెట్ల ముగింపు తర్వాత వెలువడనున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల నేపథ్యంలోనూ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉదయం సెన్సెక్స్‌ 67,506.88 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67,539.10 వద్ద గరిష్ఠాన్ని 66,948.18 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 94.05 పాయింట్ల లాభంతో 67,221.13 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 20,110.15 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20,110.35- 19,914.65 మధ్య ట్రేడైంది. చివరకు 3.15 పాయింట్లు నష్టపోయి 19,993.20 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.92 వద్ద నిలిచింది.

* నోకియా జీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ భారత మార్కెట్‌లోకి వచ్చింది. యూరప్‌లో జూన్‌లోనే విడుదలైన నోకియా జీ42 5జీ (ణొకీ ఘ్42 5ఘ్)ని తాజాగా ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇది క్వాల్‌కామ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 480+ ప్రాసెసర్‌తో వస్తోంది. ట్రిపుల్‌ కెమెరా సెట్‌, 5,000మాహ్ బ్యాటరీ ఉన్నాయి. దీన్ని భారత్‌లోనే తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.