హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయాలని మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి ఏఐసీసీ నుంచి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన ఆరీఫ్ నసీమ్ ఖాన్ ఎదుటే కార్యకర్తలు సభా వేదికపై నాయకులతో వాగ్వాదానికి దిగారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతుండగా పలువురు కార్యకర్తలు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ‘ఇక్కడ మీకేం పని.. ఇక్కడి నుంచి పోటీ చేస్తారా’ అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీ స్థాయికి ఎదిగానని, పార్టీలో బీసీలకు న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తినంటూ వీహెచ్ వారికి నచ్చజెప్పారు. అయినా.. వినకపోవడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. సభా వేదికపై గందరగోళం నెలకొనడంతో మల్లు భట్టివిక్రమార్క తనకు జూమ్ మీటింగ్ ఉందంటూ మరో గదిలోకి వెళ్లిపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోకి రావడానికి కలిసికట్టుగా కృషి చేయాలని, పదవుల కోసం తర్వాత ‘కొట్టుకుందాం.. పంచుకుందాం’ అంటూ వ్యాఖ్యానించారు. స్పందించిన రేణుకా చౌదరి.. పనిచేసిన కార్యకర్తలకు, సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడు ఆరీఫ్ నసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రసాభాసగా ఖమ్మం కాంగ్రెస్ సన్నాహక సభ
Related tags :