DailyDose

తెలంగాణా ఎన్నికలు అక్టోబరులో కాదు-తాజావార్తలు

తెలంగాణా ఎన్నికలు అక్టోబరులో కాదు-తాజావార్తలు

* ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ.. ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఆయన పోస్టులు, వీడియోలు స్ఫూర్తిని కలిగించడంతో పాటు ఆలోచింపజేస్తాయి. తాజాగా గోయెంకా ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ నెల జీతంపై కొత్త పోస్టు పెట్టారు. ‘‘ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ నెలకు రూ. 2.5 లక్షలు వేతనంగా పొందుతున్నారు. మీరు చెప్పండి. ఇది ఆయనకు సరైన జీతమేనా? డబ్బే కాకుండా ఉన్నతమైన ఎన్నో అంశాలు ఆయన లాంటి వ్యక్తులను ప్రేరేపిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. సాంకేతికత, పరిశోధనల్లో అంకితభావంతో ఆయన కృషి చేస్తున్నారు. సోమనాథ్‌ లాంటి వారు దేశం గర్వపడేలా చేయాలనుకుంటారు. కాబట్టి ఆయన లాంటి వ్యక్తులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అని గోయెంకా ట్వీట్‌ చేశారు.

* రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరు నెలలో నోటిఫికేషన్‌ రాకపోవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. మరో 6 నెలల తర్వాతే ఎన్నికలు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రగతి భవన్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తర్వాతే దీనిపై స్పష్టత రావొచ్చన్నారు. ఒక వేళ జమిలి ఎన్నికలు వచ్చినా.. ఆరు నెలలపాటు తమ ప్రభుత్వమే ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటుంది కాబట్టి.. మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

* తెదేపా అధినేత చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్‌పై సోమవారం, మంగళవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని అదనపు ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు.

* భాజపా-జేడీఎస్‌ (BJP-JDS) పొత్తుపై ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi), హోంమంత్రి అమిత్‌ షా (amit sha), పార్టీ అగ్రనేతలు కలిసి నిర్ణయం తీసుకుంటారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (BS Yediyurappa) వ్యాఖ్యానించారు. కర్ణాటక (Karnataka) లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో యడియూరప్ప ఈ విధంగా అన్నారు. దిల్లీలో నిర్వహించనున్న ఎన్నికల కమిటీ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడి హోదాలో యడియూరప్ప పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తామన్నారు.

* తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు.

* మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ తీరుపై పీవీ రమేశ్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు మేఘా సంస్థ తనను రాజీనామా చేయాలని కోరినట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ (ఎక్స్‌)లో పోస్ట్‌ చేశారు.

* తెదేపా అధినేత చంద్రబాబు ప్రాణాలకు జైలులో రక్షణ లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేస్తున్నామంటూ వైకాపా లీకులు ఇస్తోందని ఆయన మండిపడ్డారు. జైలును కూడా తమ కంట్రోల్‌లోకి తీసుకోవాలని జగన్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో చినరాజప్ప మాట్లాడారు. జైలు లోపలి అంశాలు ఎప్పటికప్పుడు సాక్షి, అనుబంధ మీడియాకు అందిస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు. ఈ పరిణామాల పట్ల రాజ్యాంగ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

* వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ బైరిశెట్టి కార్తీక్‌ చేతివాటం ప్రదర్శించాడు. తాను పని చేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి.. రూ.8,65,78,000 కొల్లగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే… బ్యాంకులోని బంగారు రుణాల విభాగంలో కార్తీక్‌ పని చేస్తున్నాడు. ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి ఆ సొమ్మును తాను అపహరించేవాడు. ఇలా 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించాడు. ఆడిటింగ్‌ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు.

* పాండోర.. సమర.. పారామౌంట్‌.. జీ20 (G20) సదస్సు సమయంలో దిల్లీ పోలీసుల (Delhi Police) సంభాషణల్లో ఇలాంటి పదాలు తరచూ వినిపించాయి.. ఇవన్నీ వీవీఐపీల కోసం వాడిన కోడ్‌ వర్డ్స్‌. దిల్లీలోని ప్రముఖ హోటల్‌ పేర్లు మొత్తం ప్రజలకు తెలిసినవి కావడంతో అధికారులు వాటిని కోడ్‌నేమ్‌లతో వ్యవహరించారు. తాజాగా దేశ రాజధానిలో భద్రతా వలయాలను తొలగించిన తర్వాత కొందరు అధికారులు నేడు ఓ ఆంగ్లపత్రికకు ఈ విషయం వెల్లడించారు.

*వలసపాలన నాటి రాజద్రోహం (ఐపీసీ 124ఏ సెక్షన్‌) (Sedition) రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. కనీసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం (Constitution Bench) ఈ కేసులను విచారిస్తుందని తెలిపింది. ప్రస్తుతం శిక్షాస్మృతి నిబంధనల్లో మార్పులు చేర్పులు చేపడుతున్న నేపథ్యంలో.. విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయడాన్ని వాయిదా వేయాలన్న కేంద్రం అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

* తెదేపా అధినేత చంద్రబాబు భధ్రతపై తనకు భయంగా ఉందని ఆయన సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జైలులో మంగళవారం సాయంత్రం చంద్రబాబును భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి కలిశారు అనంతరం జైలు వద్ద భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

* ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ (Salaar: Part 1 Ceasefire). రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ సెప్టెంబరు 28న విడుదల కావాల్సి ఉంది. గ్లింప్స్‌తోనే చిత్ర బృందం ‘సలార్‌’పై అంచనాలను పెంచేసింది. అయితే, ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించకపోయినా, ‘సలార్‌’ వాయిదా పడినట్లే. అందుకు కారణం వీఎఫ్‌ఎక్స్‌. కీలక సన్నివేశాలను మరింత ఎలివేట్‌ చేసేందుకు డిజైన్‌ చేసుకున్న వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌కు సంబంధించి పనులు పూర్తికాకపోవడంతో సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారని సమాచారం.

* లోకేశ్‌ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందన్న ఆక్రోశంతోనే వైకాపా ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా నాయకురాలు నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు. తెదేపా (TDP) కార్యాలయంలో మీడియో మాట్లాడిన రాజకుమారిపై చంద్రబాబు (Chandrababu) అరెస్టుపై కన్నీటిపర్యంతమయ్యారు. బాబు యాత్ర, యువగళం మళ్ళీ త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. భువనేశ్వరి గారికి అండగా ఉంటామని చెప్పారు.