Politics

చంద్రబాబు భద్రతపై ఆందోళన-నేరవార్తలు

చంద్రబాబు భద్రతపై ఆందోళన-నేరవార్తలు

* తెదేపా అధినేత చంద్రబాబు భద్రతపై తనకు భయంగా ఉందని ఆయన సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జైలులో మంగళవారం సాయంత్రం చంద్రబాబును భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి కలిశారు అనంతరం జైలు వద్ద భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

* ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీర్జాపుర్‌లో దోపిడీ దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. ఓ ఏటీఎం వద్ద తచ్చాడుతూ తిరిగి.. అందులో డబ్బులు నింపడానికి వచ్చిన వ్యాన్‌ను లూటీ చేశారు. ఈ క్రమంలో ఓ గార్డును కాల్చి చంపి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్‌లో యాక్సిస్‌ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మంగళవారం ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యాన్‌లో వచ్చారు. వారు దిగి డబ్బులు ఏటీఎంలో నింపే పనిలో నిమగ్నం అవుతుండగా.. తొలుత హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి అక్కడ తచ్చాడుతూ కనిపించాడు. బ్యాంకు ఉద్యోగులు వ్యాన్‌ తలుపు తెరవగానే హెల్మెట్‌ ధరించి వచ్చిన మరో దుండగుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే గార్డును తుపాకీతో కాల్చాడు. దాంతో గార్డు కిందపడిపోయాడు. లేవడానికి ప్రయత్నించి స్పృహ తప్పి మళ్లీ పడిపోయాడు. ఇంతలో తెల్ల చొక్కా ధరించి వచ్చిన మరో దుండగుడు వ్యాన్‌ డోరు వద్దకు వెళ్లి రూ.39 లక్షల నగదుతో ఉన్న పెట్టెను తీసుకొని పరాయ్యాడు. ఈ లోగా ఓ బ్యాంకు ఉద్యోగి అప్రమత్తమై పారిపోగా.. మరో ఉద్యోగి తన బ్యాగు తీసుకొని వ్యాన్‌లో కూర్చున్నాడు. రోడ్డు పక్కనే ఆగి ఉన్న మరో దుండగుడు అతడితో పెనుగులాడి ఆ బ్యాగు లాక్కొని పారిపోయాడు. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసింది. ముఖాలు కన్పించకుండా జాగ్రత్త పడిన ఆ ముఠా బైక్‌లపై పరారైనట్లు సమాచారం.

* వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ బైరిశెట్టి కార్తీక్‌ చేతివాటం ప్రదర్శించాడు. తాను పని చేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి.. రూ.8,65,78,000 కొల్లగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే… బ్యాంకులోని బంగారు రుణాల విభాగంలో కార్తీక్‌ పని చేస్తున్నాడు. ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి ఆ సొమ్మును తాను అపహరించేవాడు. ఇలా 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించాడు. ఆడిటింగ్‌ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు. కొల్లగొట్టిన సొమ్మును క్రికెట్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి… అతడిని రిమాండ్‌కు తరలించారు.

* మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ బాధ్యతల నుంచి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ తీరుపై పీవీ రమేశ్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

* తెదేపా అధినేత చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇంటి కంటే జైలు వద్దే భధ్రత ఎక్కువ అని భావిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌జీ ప్రొటెక్ట్‌ చేసే వ్యక్తిగా ఓ ఇంటి వద్ద ఆ స్థాయి భద్రత కల్పించలేమని పేర్కొంటూ హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. హౌస్‌ కస్టడీ పిటిషన్పై పిటిషనర్‌ చేసిన వాదలపై సంతృప్తి చెందలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రిమాండ్ రిపోర్టు లో దాఖలు చేసిన పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అరెస్టు సమయంలో కాల్ రికార్డులను భద్రపర్చాలని మరోమారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

* హరియాణాలోని నూహ్‌లో చెలరేగిన అల్లర్లలో నిందితుడిగా భావిస్తున్న మోనూ మానేసర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మార్కెట్‌ ప్రాంతంలో అతడిని పట్టుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. నూహ్‌లో హింసను ప్రేరేపించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ అల్లర్లలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 286 మందిని పోలీసులు అరెస్టు చేశారు.