Kids

ఐరాస సభలకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

ఐరాస సభలకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మన రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల 10 మంది విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలో ఈ నెల 16 నుండి జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు హాజరవడం గర్వకారణమని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐ.రా.స.లో అడుగుపెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లల అభ్యున్నతికి చేస్తున్న కృషికి నిదర్శనం అన్నారు. ఈ సదస్సులో పాల్గొనడానికి అమెరికా పయనం అవుతున్న విద్యార్థులతో బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రయాణంలోను, అమెరికాలోను తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి, సూచనలు చేశారు.

నార్త్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పర్యటన విజయవంతం చేసుకోవాలని అన్నారు. ఎనిమిది మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన ప్రతినిధుల బృందాన్నిపూర్తి ప్రభుత్వ వ్యయంతోనే ఈ అమెరికాకు తీసుకెళ్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని తెలిపారు. వారం రోజుల పాటు ఈ పర్యటన ఉంటుందన్నారు.