* కార్లలో ఎయిర్‌బ్యాగులకు సంబంధించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం అనుకోవడం లేదని తెలిపారు. కార్లలో ప్రయాణికుల భద్రత కోసం ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆరు ఎయిర్ బ్యాగులు నిబంధన తీసుకురానున్నట్లు గతంలో మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. తప్పనిసరి చేయాలనుకోవడం లేదని తెలిపారు. కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చేందుకు భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఇటీవల తీసుకొచ్చినట్లు గడ్కరీ తెలిపారు. దీంతో ఒక కారు 5 స్టార్ రేటింగ్ పొందాలంటే 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మెరుగైన స్టార్ రేటింగ్ అందుకునే క్రమంలో ఆరు ఎయిర్‌బ్యాగులను కార్ల కంపెనీలు అమర్చాల్సి ఉంటుందని, అందుకే తాము తప్పనిసరి చేయాలని అనుకోవడం లేదని గడ్కరీ తెలిపారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. వరుస లాభాల నుంచి నిన్న నిఫ్టీ స్వల్ప విరామం తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఈరోజు లాభాల పరంపరను అందుకుంది. నిన్న సెన్సెక్స్ లాభపడినప్పటికీ.. నిఫ్టీ స్వల్ప నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం తీవ్ర ఊగిసలాట మధ్య ప్రారంభమైన మార్కెట్లకు మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల అండ లభించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడం వంటి సానుకూల పరిణామాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణించడం విశేషం. ఉదయం సెన్సెక్స్ 67,188.64 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67,565.41 వద్ద గరిష్ఠాన్ని 67,053.36 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 245.86 పాయింట్ల లాభంతో 67,466.99 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,989.50 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20,096.90- 19,944.10 మధ్య ట్రేడైంది. చివరకు 76.80 పాయింట్లు లాభపడి 20,070 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.98 వద్ద నిలిచింది.
* దేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్ (Blue Dart ) తాజాగా కీలక ప్రకటన చేసింది. కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చబోతోందన్న వార్తల నేపథ్యంలో ఇండియాలోని తమ ప్రీమియం సర్వీస్ డార్ట్ ప్లస్ (Dart Plus) బ్రాండ్ పేరును భారత్ ప్లస్ (Bharat Plus)గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీసులు భారత్ డార్ట్ (Bharat Dart) పేరుతో కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక మార్పు బ్లూ డార్ట్ ప్రయాణంలో ఒక మైలురాయిని సూచిస్తుందని అభిప్రాయపడింది. భారత విభిన్న అవసరాలను తీర్చడంలో తిరుగులేని నిబద్ధతను తెలియజేస్తుంది బ్లూ డార్ట్ పేర్కొంది. కాగా, బ్లూ డార్ట్‌ను భారత్ డార్ట్‌గా మార్చేందుకు గల కారణాలను సంస్థ వివరించింది. తమ వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఒక విస్తృతమైన ఆవిష్కరణ, పరిశోధన ప్రక్రియ నుంచి వచ్చినట్లు తెలిపింది. తమ కంపెనీ భారత్‌ను ప్రపంచంతో కలిపేందుకు, ప్రపంచాన్ని భారత్‌తో కలిపేందుకు ఈ మార్పు చెందుతున్న ప్రయాణంలో భాగం కావాలని తమ భాగస్వాములను కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
* గృహ, కారు, వ్యక్తిగత, విద్యా రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మంగళవారం పండుగ ఆఫర్లను ప్రకటించింది. 2023 డిసెంబర్ వరకూ ఇవి అమలులో ఉంటాయని బ్యాంక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పండుగ ఆఫర్లలో భాగంగా వివిధ ప్రయోజనాల్ని, రాయితీలను అందించే నాలుగు కొత్త సేవింగ్స్ ఖాతాల్ని ప్రారంభించినట్టు తెలిపింది. తమ డెబిట్, క్రెడిట్‌కార్డు హోల్డర్లకు పండుగ ఆఫర్లను, డిస్కౌంట్లను అందచేయడానికి ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, ఫుడ్ విభాగాల్లో టాప్ బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు బీవోబీ వెల్లడించింది.
* ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటంతో ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు లేవని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష బంగారి తెలిపారు. హైదరాబాద్‌లో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)తో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశీయ ఎగుమతులకు ఊతమివ్వడానికి ఎగ్జిమ్ బ్యాంక్ కృషి చేస్తున్నదని, ముఖ్యంగా నిర్మాణ, కెమికల్, ఫార్మా ఆయా రంగాలకు సంబంధించిన సంస్థలకు రుణాలు కూడా ఇచ్చినట్టు తెలిపారు. అంతర్జాతీయంగా అవకాశాలు ఉన్నచోట రుణాలు మంజూరు చేస్తున్నది.