Business

₹2000 నోట్లు తిరస్కరించనున్న అమెజాన్-వాణిజ్య వార్తలు

₹2000 నోట్లు తిరస్కరించనున్న అమెజాన్-వాణిజ్య వార్తలు

* గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది జనవరిలోనే దాదాపు 12వేల ఉద్యోగాలను తొలగించిన ఈ కంపెనీ తాజాగా గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆల్ఫాబెట్ తీసుకున్న తాజా తొలగింపుల నిర్ణయంతో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. వెంటనే మరో ఉద్యోగం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లింక్డిన్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న కొంతమంది నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం ఇంట్రాడేలో జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. తర్వాత లాభాల స్వీకరణతో తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అయినప్పటికీ.. రికార్డు ముగింపులను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు, వరుస ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ, నిఫ్టీ50 వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ వంటి పరిణామాల నేపథ్యంలోనే సూచీలు లాభాల జోరును స్థిరంగా కొనసాగించలేకపోయాయని నిపుణులు చెప్పారు. ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 67,627.03 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67,771.05 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 52.01 పాయింట్ల లాభంతో 67,519.00 దగ్గర స్థిరపడింది. ఇప్పటి వరకు సెన్సెక్స్‌కు ఇదే రికార్డు ముగింపు. నిఫ్టీ (Nifty) 20,127.95 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20,167.65 జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 33.10 పాయింట్లు లాభపడి 20,103 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.03 వద్ద నిలిచింది.

* ఐటీఐ లిమిటెడ్‌ షేరు ఇంట్రాడేలో దాదాపు 7 శాతం పెరిగి రూ.213.30 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. తర్వాత లాభాల స్వీకరణ నేపథ్యంలో చివరకు 2.83 శాతం నష్టపోయి రూ.194 దగ్గర స్థిరపడింది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్‌ 52.46 శాతం పుంజుకోవడం విశేషం. సొంత బ్రాండ్‌తో ల్యాప్‌టాప్‌, మైక్రో పీసీ తీసుకురానున్నట్లు ఈ కంపెనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

* ఆల్కెమ్‌ ల్యాబ్స్‌కు చెందిన పలు ప్రదేశాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో కంపెనీ షేరు ఈరోజు 0.53 శాతం నష్టపోయి రూ.3,725 దగ్గర ముగిసింది. నవనీత్‌ ఎడ్యుకేషన్‌లో కేదారా క్యాప్‌ మైనారిటీ వాటాలను కొనుగోలు చేసింది. దీంతో నవనీత్‌ షేరు ఈరోజు 3.77 శాతం పుంజుకొని రూ.154 దగ్గర స్థిరపడింది. ఏఎఫ్‌సీ కమర్షియల్‌ బ్యాంక్‌ తమ బ్యాంకింగ్‌ కార్యకలాపాల ఆధునికీకరణ కోసం ఇంటెలెక్ట్‌ డిజైన్‌ అరీనాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇంటెలెక్ట్‌ డిజైన్‌ షేరు ఈరోజు 2.32 శాతం రాణించి రూ.687 దగ్గర ముగిసింది.

* కళామందిర్‌ (Kalamandir) పేరిట సంప్రదాయ దుస్తుల విక్రయశాలలను నిర్వహిస్తున్న సాయి సిల్క్స్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ (Sai Silks IPO) సెప్టెంబరు 18న ప్రారంభం కానుంది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 22న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.201- 222గా సంస్థ నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.1,201 కోట్ల సమీకరించనుంది. కనీసం 67 (ఒక లాట్‌) షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఐపీఓలో పాల్గొనాలనుకునేవారు గరిష్ఠ ధర దగ్గర కనీసం రూ.14,974 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

* ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ (Tata motors) తన విజయవంతమైన ఎస్‌యూవీ నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ను (Tata nexon) గురువారం ఆవిష్కరించింది. దీని ధర రూ.8.09 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. దీంతో పాటు నెక్సాన్‌ ఈవీ ఫేస్‌ లిఫ్ట్‌ను కూడా టాటా మోటార్స్ లాంచ్‌ చేసింది. దీని ధర రూ.14.74 లక్షల నుంచి రూ.19.94 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది. బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని, డెలివరీలు త్వరలోనే ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

* రూ.2,000 నోట్ల (Rs.2000 notes)ను మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 19 నుంచి ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD)’ల చెల్లింపులకు రూ.2,000 నోట్ల (Rs.2000 notes)ను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంగానీ లేదా మార్చుకునేందుకుగానీ సెప్టెంబరు 30 వరకు సమయం ఉన్న విషయం తెలిసిందే. రూ.2,000 నోట్ల (Rs.2000 notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో వీటిని చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఉపసంహరణ నేపథ్యంలో సెప్టెంబరు 1 నాటికి 90 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇటీవల తెలిపారు. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. తిరిగొచ్చిన రూ.2,000 నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చినట్లు చెప్పారు.