Movies

రెహమాన్‌ కాన్సర్ట్‌.. అవన్నీ అసత్యాలు..

రెహమాన్‌ కాన్సర్ట్‌.. అవన్నీ అసత్యాలు..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ కాన్సర్ట్‌లో తీవ్ర గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌కాగా చాలామంది రెహమాన్‌ను విమర్శించారు. ఈవెంట్‌ నిర్వాహకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కొన్ని రోజులుగా ఇదే హాట్‌టాపిక్‌ గా మారింది. ఈ క్రమంలోనే స్థానిక య్యూటూబ్‌ ఛానెల్‌ ‘యాంటీ ఏఆర్‌ రెహమాన్‌ టీమ్‌ కాట్‌ విత్‌ ఎవిడెన్స్‌’ పేరుతో ఓ వీడియో చేసింది. రెహమాన్‌ ఈవెంట్‌ ఫ్లాప్‌నకు నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోనీ సహా పలువురు కారణమంటూ ఆరోపణలు చేసింది. దీనిపై విజయ్‌ ఆంటోనీ స్పందించారు. దాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వేదికగా ఓ లెటర్‌ పోస్ట్‌ పెట్టారు.

‘‘బాధాతప్త హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా ఓ సోదరి నా గురించి, నా బ్రదర్‌ రెహమాన్‌ గురించి అసత్యాలు ప్రసారం చేశారు. వారిపై పరువు నష్టం దావా వేస్తా. పరిహారంగా వచ్చే మొత్తాన్ని మ్యూజిక్‌ ఇండస్ట్రీలో అవసరం ఉన్న వారికి ఇస్తా’’ అని తెలిపారు. ‘మరకుమ నెంజమ్‌’ పేరిట ఈ నెల 10న రెహమాన్‌ కాన్సర్ట్‌ జరిగింది. ప్రాంగణ సామర్థ్యానికిమించి అభిమానులకు టికెట్లు విక్రయించారు. దాంతో, సీట్లు సరిపోక, వాహనాల పార్కింగ్‌కు స్థలంలేక చాలామంది అవస్థలు పడ్డారు. గోల్డ్‌ పాసులు ఉన్నప్పటికీ కొందరిని లోపలికి అనుమతించలేదు. దీంతో చాలామంది ఒకే సమయంలో వెనుదిరగడంతో ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఈ పరిణామాలపై రెహమాన్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కాన్సర్ట్‌కు హాజరు కాలేకపోయిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని మాట ఇచ్చారు. కార్తి, ఉదయనిధి స్టాలిన్‌, ఖుష్బూ, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా తదితరులు రెహమాన్‌కు మద్దతుగా నిలిచారు.