కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు యోధుల అంత్యక్రియల్లో దృశ్యాలు మెలిపెడుతున్నాయి. కర్నల్ మన్‌ప్రీత్‌సింగ్ అంత్యక్రియల్లో ఆయన పిల్లల అమాయకత్వం ప్రతిఒక్కరినీ కంటతడిపెట్టిస్తోంది.
కర్నల్ మన్‌ప్రీత్ సింగ్ భౌతికకాయాన్ని శుక్రవారం ఆయన స్వస్థలం ముల్లాన్‌పుర్‌కు తీసుకువచ్చారు. దానిని చూడగానే కుటుంబ సభ్యులు కన్నీమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మరోపక్క సింగ్ ఆరేళ్ల కుమారుడు సైనికుడి దుస్తుల్లో తండ్రికి వీడ్కోలు సెల్యూట్ చేశాడు. పక్కనే ఉన్న చిన్నారి చెల్లి తన అన్నను అనుకరించింది. ఆ ఇద్దరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంత వయస్సు వారికి లేదు కూడా. కర్నల్ దూరమైన బాధ ఒకవైపు.. పసిపిల్లల అమాయకత్వం మరోవైపు అక్కడున్న ప్రతి మనసును బరువెక్కించింది.
19వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు కర్నల్ సింగ్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అనంత్ నాగ్‌లోని కొకెన్‌నాగ్‌కు చెందిన గడోల్ అడవుల్లో ఉన్న ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. ఈ ఘటనలో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డీఎస్పీ హుమాయూన్ భట్ సహా మరో సైనికుడు అమరులయ్యారు. ముగ్గురు కీలక అధికారుల మరణంతో సైన్యం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. భారీగా బలగాలను ఆ ప్రాంతానికి తరలించింది. దాంతో మూడు రోజులుగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మరోపక్క ఆశిశ్ భౌతిక కాయాన్ని పానిపట్‌లోని ఆయన సొంత గ్రామానికి తరలించారు. ఆయన అంతిమ యాత్ర భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. ఆశిశ్‌కు రెండేళ్ల కుమార్తె ఉంది. మరోపక్క భట్ అంత్యక్రియలు నిన్న ముగిశాయి.