యూరిన్ వాసన ఉండడం సర్వసాధారణమైన విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విపరీతమైన దుర్వాసన వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దుర్వాసనతో పాటు, మూత్రం రంగు మారితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మూత్రం దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. కాఫీ తాగే అలవాటు ఉన్న వారిలో కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫిన్. అంతేకాకుండా కెఫిన్ వల్ల శరీరం డీహైడ్రేషన్ గురవుతుంది. ఇది కూడా యూరిన్ దుర్వాసనకు ఒక కారణంగా చెప్పొచ్చు.
ఇక వెల్లుల్లి, ఉల్లి అధికంగా వేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా యూరిన్ దుర్వాసన వస్తుంది. వీటిలో ఉండే సల్ఫర్ మూత్రాన్ని కలుషితం చేస్తుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల కుళ్లిన గుడ్డులాంటి వాసన వస్తుంది. జీలకర్ర, పసుపు, కొత్తిమీర వంటివి అధికంగా తీసుకున్నా యూరిన్ దుర్వాసన వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆహారంలో జీర్ణమైన తర్వాత కూడా మూత్రంలో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. దీంతో దుర్వాసన ఎక్కువగా వస్తుంది.
ఇక మూత్రం దుర్వాసనతో వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. దుర్వాసనతోపాటు మూత్రం రంగులో మార్పులు కనిపించినా, నొప్పిగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడినా మూత్రం దుర్వాసన వస్తుంది. టైప్2 డయాబెటిస్, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారికి కూడా మూత్రం దుర్వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మూత్రం దుర్వాసన వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన టెస్ట్‌లు చేయించుకోవాలని సూచిస్తున్నారు.