ScienceAndTech

టిక్‌టాక్‌కు భారీ జరిమానా

టిక్‌టాక్‌కు భారీ జరిమానా

చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌కు (TikTok) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు దేశాల్లో నిషేధం ఎదుర్కొంటున్న ఈ యాప్‌నకు యూరప్‌లో చుక్కెదురైంది. యూరప్‌ కఠిన గోప్యతా నిబంధనలు ఉల్లంఘించినందుకు అక్కడి నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. చిన్నారుల గోప్యతా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ దాదాపు రూ.3 వేల కోట్లు (368 మిలియన్‌ డాలర్లు) జరిమానా వేసింది. ఈయూ నిబంధనలు ఉల్లంఘించినందుకు టిక్‌టాక్‌కు ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడం ఇదే తొలిసారి. ఈయూ తీసుకొచ్చిన గోప్యతా నిబంధనలను 2020లో టిక్‌టాక్‌ ఉల్లంఘించిందని ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ తెలిపింది. టీనేజీ పిల్లలు లాగిన్‌ అయినప్పుడు వారికీ డిఫాల్డ్‌ సెట్టింగ్స్‌ ఉంటున్నాయి. దీనివల్ల టీనేజీ చిన్నారుల వీడియోలను అందరూ వీక్షించేలా, కామెంట్‌ చేసేందుకు అనుమతిస్తున్నట్లు విచారణలో కమిషన్‌ గుర్తించింది. 13 ఏళ్లలోపు వారు లాగిన్‌ అవ్వడానికి వీల్లేనప్పటికీ.. వారినీ అనుమతిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాటు తల్లిదండ్రుల కోసం రూపొందించిన ‘ఫ్యామిలీ పెయిరింగ్’ ఫీచర్‌లో కూడా లోపాలు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో టిక్‌టాక్‌కు భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.