Politics

బీసీలకు 33శాతం రిజర్వేషన్ కావాలని కేసీఆర్ లేఖ-తాజావార్తలు

బీసీలకు 33శాతం రిజర్వేషన్ కావాలని కేసీఆర్ లేఖ-తాజావార్తలు

* భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) లేఖ రాశారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీసీ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, వారి హక్కుల రక్షణకు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు. బేగంపేటలోని ప్రగతి‌భవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీలు, మహిళలకు చట్టసభల్లో 33శాతం బిల్లు కోసం పోరాడాలని నిర్ణయించారు.

* హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పర్యటించనున్నారు. ఈ మేరకు అధిష్ఠానం ఓ ప్రకటన విడుదల చేసింది. రేపు మధ్యాహ్నం 12:35 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి రాహుల్ వస్తారు. నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌లో CWC సమావేశంలో(CWC meeting) పాల్గొననున్నారు. 17వ తేదీన తుక్కుగూడ సభ అనంతరం శంషాబాద్ నుంచే రాత్రి 8:50 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.అలాగే రేపు 12:15 నిమిషాలకు శంషాబాద్‌కు ప్రియాంక గాంధీ వస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు.అనంతరం తాజ్ కృష్ణ హోటల్‌లో cwc మీటింగ్ లో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. అయితే ప్రియాంక గాంధీ తిరుగు ప్రయాణం ఇంకా ఖరారు కాలేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు.

* ఏపీలో జగన్‌రెడ్డి(Jagan Reddy) .. కిల్ డెవలప్‌మెంట్ పాలసీని అవలంభిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్( Payyavula Keshav ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇమేజ్‌కు మరక అంటించాలనే ప్రయత్నంలో భాగంగానే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఏపీ నుంచి జగన్ సర్కార్ పరిశ్రమలను తరిమేసింది.సిమెన్స్‌, ఒరిజనల్ సిమెన్స్‌కు సంబంధం లేదని వైసీపీ నిరూపించాలి. చంద్రబాబు అరెస్ట్‌తో వేల మంది జీవితాలు తారుమారయ్యాయి.ఏపీ ప్రభుత్వం కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇస్తోందని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

* టైమ్‌ మ్యాగజైన్‌ స్టాటిస్టాతో కలిసి ప్రపంచంలో 100 అత్యుత్తమ కంపెనీల జాబితా (TIME World’s Best Companies 2023)ను విడుదల చేసింది. దీనిలో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్‌ (Apple), గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌, మెటా ప్లాట్‌ఫామ్స్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో కేవలం ఒకే భారత కంపెనీ స్థానం దక్కించుకుంది. దేశీయ టెక్‌ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ (Infosys) టైమ్‌ 100 అత్యుత్తమ కంపెనీల జాబితా (World’s Best Companies 2023)లో 64వ స్థానంలో నిలిచింది.

* చందమామ (Moon)పై నీటి జాడలున్నట్లు భారత్‌ సహా పలు దేశాలు జరిపిన ప్రయోగాల్లో నిర్ధారణ అయినా.. అవి ఎలా ఏర్పడ్డాయన్న (Water Fornation) దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవు. వాతావరణమేలేని జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్ల రహస్యాల గురించి ఇప్పటివరకు అనేక అధ్యయనాలు బయటికొచ్చాయి. దీనికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్స్‌ (Electrons) కారణంగానే చంద్రుడిపై నీరు ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్‌ హవాయి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్‌ (India) ప్రయోగించిన చంద్రయాన్‌-1 (Chandrayaan-1) మిషన్‌ సేకరించిన డేటా నుంచే ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. చంద్రయాన్‌-1 మిషన్‌లోని ఇమేజింగ్‌ స్పెక్ట్రోమీటర్‌ అయిన మూన్‌ మినరాలజీ మ్యాపర్‌ పరికరం సేకరించిన రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను అమెరికాలోని మనోవాలో గల యూనివర్సిటీ ఆఫ్‌ హవాయి శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనం చేసింది. అనంతరం ఆ వివరాలను జర్నల్‌ నేచర్‌ ఆస్ట్రానమీలో ప్రచురించింది. భూ వాతావరణంలో ఉండే ఎలక్ట్రాన్స్‌.. చంద్రుడిపై నీరు ఏర్పడటానికి దోహదపడి ఉంటాయని వీరి అధ్యయనంలో తేలింది. ఈ ఎలక్ట్రాన్స్‌.. జాబిల్లి ఉపరితలంపై ఉండే శిలలు, ఖనిజాలను విచ్ఛిన్నం చేయడం లేదా కరిగించడం వంటి పర్యావరణ ప్రక్రియలకు దోహదం చేసి ఉంటాయని ఈ బృందం పేర్కొంది.

* ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ (Rajasthan) ఒకటి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) పార్టీ.. మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల రోడ్‌మ్యాప్‌ ఖరారుకు, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్‌ వేదికగా శనివారం నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రానున్న ఎన్నికల వ్యూహ రచనకు ఈ సమావేశాలు ఎంతో కీలకమని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) పేర్కొన్నారు. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న పార్టీని తదుపరి ఎన్నికల్లో ఓడించే సంప్రదాయాన్ని తిరగరాస్తామని ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

* ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించిన 9 మెడికల్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వానిది నయా పైసా లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Arvind Dharmapuri) ఆరోపించారు. మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం కేంద్రం నుంచి పూర్తి సహాయం అందిందన్నారు. ఇంకా పనులు, సౌకర్యాలు పూర్తి చేయకముందే ప్రారంభించారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే అదరా బాదరాగా కేసీఆర్ ప్రారంభించారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్స్‌తో 9 మెడికల్ కళాశాలలు ప్రారంభించారని చెప్పారు. దేశ వ్యాప్తంగా మోదీ తీసుకున్న పాలసీ వల్ల వైద్యుల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు.

* విజయవాడలోని వివిధ కళాశాలల్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విద్యార్థులు నిరసన చేస్తారేమోనన్న ఉద్దేశంతో పోలీసులు కళాశాలలను బలవంతంగా ఖాళీ చేయించారు. నగరంలోని సిద్దార్థ, పీవీపీ ఇంజినీరింగ్‌ కళాశాలల్లోకి పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లారు. తరగతులు సస్పెండ్‌ చేయించి కళాశాలలకు సెలవు ఇప్పించారు.

* సీమెన్స్‌ ఇండస్ట్రియల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కి, సీమెన్స్‌కి సంబంధం లేదని నిరూపించగలరా? అని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌కు తెదేపా సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆ రెండూ సంస్థలూ ఒక్కటే అని నేను నిరూపిస్తా.. కాదని మీరు నిరూపించగలగరా?’ అని ప్రశ్నించారు

* తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నిరసనకు దిగారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఫ్రీడమ్‌ పార్కులో వారంతా ఆందోళన చేపట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’, ‘వియ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

* దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavita) సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళినీ చిదంబరం తరహాలోనే తమకూ ఊరట కావాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఈడీ న్యాయవాది స్పందన కోరింది. తమకు అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

* తెలంగాణలో రానున్న మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

* తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ (Kasani Gnaneshwar)ను హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్‌ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అమీర్‌పేటలోని కాసాని ఇంటికి వెళ్లి దత్తాత్రేయ పరామర్శించారు. కాసాని జ్ఞానేశ్వర్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలువాలని బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ఆకాంక్షించారు.

* తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు నైజీరియన్లు సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులోని రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు విషయాలను పోలీసులు పేర్కొన్నారు. నటుడు నవదీప్‌ పరారీలో ఉన్నట్టు తెలిపారు.

* ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ (WhatsApp)లో ఇకపై యాడ్స్‌ రానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి మీడియా కథనాలు. చాట్‌ స్క్రీన్‌పై యాడ్స్‌ తీసుకురావటంపై వాట్సాప్‌ యోచిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు బయటకు వచ్చాయి. ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగానే ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తోందంటూ కథనాలు వెలువడ్డాయి. దీన్ని వాట్సాప్‌ ఖండించింది.