Devotional

భాద్రపద మాసంలో దశావతార వ్రతం విశేషాలు

భాద్రపద మాసంలో దశావతార వ్రతం విశేషాలు

భాద్ర మాసం ఎంతో విశిష్టత కలది. ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసం వర్షరుతువులో వస్తుంది. ఈ నెలలో రెండు విశేషాలు ఉన్నాయి. శుక్ల పక్షంలో అంతా దేవతలకు, పూజలకు, వ్రతాలకు ప్రాధాన్యమిస్తారు. క్రిష్ణ పక్ష కాలంలో పిత్రు దేవతలకు నెలవైన మాసంగా పండితులు చెబుతారు. సాధారణంగా దుష్ట శిక్షణ చేయడానికి శిష్ట రక్షణ చేయడానికి దశావతారాలు ఎత్తాడనే విషయం అందరికీ తెలుసు. ఆ దశావతరాల్లోని వరాహ అవతారం, వామన అవతార పూజలు ఈ మాసంలోనే చేస్తారు. అందుకే ఈ నెలలో దశావతార వ్రతం చేయాలంటారు. ఈ మాసంలో ముందుగా వచ్చే పండుగ వినాయక చతుర్థి. ఇదే నెలలో వామన జయంతి, రుషి పంచమి, ఉండ్రాళ్ల తద్దె, పిత్రు దేవతలకు ఉత్తమ గతులు కల్పించే మహాలయ పక్షంగా పండితులు చెబుతారు.

*** హరితాళిక వ్రతం
కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. అలాగే సువర్ణగౌరీ, పదహారు కుడుముల తదియ మొదలైనవి చేస్తారు. ఈ హరితాళిక సువర్ణగౌరీ పదహారు కుడుముల తదియ మొదలైన నోములు ఈ మూడు కూడా చవితి మందురోజు అనగా వేరు వేరు ప్రాంతాల వారు వేరు వేరుగా జరుపుకొంటారు. అన్ని సారాంశం ఒకటే ఈ రోజు ఉపవాసం ఉండడం. ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం ఈ రోజు ప్రత్యేకాంశం. ఈ వ్రతాన్ని ఆచరించి , ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి , అష్టైశ్వర్యాలతో తులతూగుతారనేది నమ్మకం.

*** వినాయక చవితి
ఈ మాసంలో ముందుగా వచ్చేది వినాయక చవితి. మనం ఏ పూజ చేసినా.. తొలిగా ఆరాధించేది గణేశుడినే. వినాయకుడు పుట్టినరోజునే గణపతి పండుగ జరుపుకుంటారు. ఇప్పటికే వినాయక ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజను తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో 21 రకాల పత్రాలతో పూజించి ఉండ్రాళ్లు, కుడుములతో పాటు లడ్డూను నైవేద్యంగా పెడతారు. విద్యార్థులు పుస్తకాలను పెట్టి పూజిస్తారు.

*** బుషి పంచమి
భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్యపురాణంలో చెప్పబడింది. ఈ వ్రతం లో ముఖ్యం గా ఆచరించవలసినది , బ్రాహ్మాణుడికి అరటి పళ్ళు , నెయ్యి , పంచదార , దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం , పాలు , పెరుగు , ఉప్పు , పంచాదారలతో తయారు చేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.

*** బుద్ధ జయంతి
బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన , పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.

*** సూర్య షష్ఠి
భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం , ఈరోజున సూర్యుడిని ఆవుపాలు , పెరుగు , నెయ్యి , గోమయం , గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.

*** కేదార వ్రతం
భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దంగా ఆచరిస్తుంటారు. , దేవ , ఋషి , పితరులకు తర్పణాలు చేయాలని పండితులు చెబుతున్నారు.

*** శుద్ద అష్టమి
భాద్రపదమాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున శ్రీకృష్ణుని రాధను పూజించాలి. దీనినే రాధాష్టమి అంటారు. దీనివల్ల ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహం చేసుకున్నవారికి వైవాహిక జీవన సౌఖ్యం కూడా లభిస్తుంది. వారిద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది.

*** దశావతార దశమి వ్రతం
భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరిస్తారు. విష్ణువు దశావతారానికి అంకితం చేయబడింది. దశావతార దశమి వ్రతం సాంప్రదాయ హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో శుద్ద దశమి రోజున చేస్తారు. ఈ రోజున శ్రీ హరి విష్ణువు యొక్క పది అవతారాలను పూజిస్తారు.

*** ఏకాదశి..
భాద్రపదమాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి నాడు అనగా ఆషాఢ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఈరోజున వేరే వైపునకు తిరుగుతాడు అనగా పరివర్తనం చెందుతాడు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కరువు కాటకాలు రావని ఒకవేళ వచ్చినా వాటి నుండి ఎలా బయటపడాలో తెలుస్తుందని పండితులు చెబుతున్నారు.

*** అజ ఏకాదశి..
భాద్రపద మాసంలో వచ్చే ఈ ఏకాదశినే ధర్మ ప్రభ ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్ని పూర్వ కాలంలో హరిశ్చంద్రుడు ఆచరించాడని పెద్దలు చెబుతుంటారు. హరిశ్చంద్రుడు సర్వం కోల్పోయి కాటికాపరిగా ఉన్న సమయంలో ఈ ఏకాదశి రోజున వ్రతం చేయడం వల్ల తిరిగి తన ధనం, ఐశ్వర్యం, రాజ్యభోగాలు పొందాడని పండితులు చెబుతారు. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేయాలని సూచిస్తుంది.

*** శుక్ల ద్వాదశి..
ఈ మాసంలో వామన జయంతి, దశావతారాల్లో ఒక అవతారం. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించిన అవతారం. ఈరోజున వామనపూజ చేసి నైవేద్యం పెట్టి పెరుగును దానం చేయాలని చెబుతారు. ఈరోజున విష్ణువు ఆలయంలో ప్రదక్షిణలు చేయడం, విష్ణుమూర్తికి చామంతి పువ్వులు, మల్లెపువ్వులు లేదా పసుపు పచ్చని పూలతో పూజించడం చాలా మంచిది. భూదానం వంటివి చేసుకునేవాళ్లు ఈరోజు భూదాన నిమిత్తం ధనం కూడా దానం చేసుకోవచ్చు.

*** శుక్ల చతుర్దశి..
ఇదే నెలలో అనంత పద్మనాభ చతుర్దశి. ఇది కూడా విష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈరోజున అనంత పద్మనాభ చతుర్దశి లేదా అనంతవ్రతం అనే పేర్లతో పిలుస్తారు.

*** ఉండ్రాళ్ళతద్ది
భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దెగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ , ముఖ్యంగా కన్నె పిల్లలు గౌరీ దేవి ని పూజించి , ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు అయిదవతనం వృద్ది చెందుతుంది

*** మహాలయ పక్షం..
ఈ మాసంలో క్రిష్ణ పక్షంలో పాడ్యమి ప్రారంభం అమావాస్య వరకు వచ్చిన కాలాన్ని మహాలయ పక్షం అంటారు. ఈ కాలంలో పిత్రు దేవతలకు పిండ ప్రదానములు, తర్పణాలు ఇవ్వడం వంటివి చేయాలి. తర్పణాలు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడిచిపెట్టి తర్వాత భోజనం చేయొచ్చు. ఈ మహాలయ పక్షంలో పిత్రు దేవతలను తలచుకుని నువ్వులు, బియ్యం వంటివి దానం చేస్తే మంచిది. అలాగే ప్రతి రోజూ ఏదో ఒక కూరగాయను దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.