Politics

పరేడ్ గ్రౌండ్‌లో అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టర్లు-తాజావార్తలు

పరేడ్ గ్రౌండ్‌లో అమిత్ షాకు వ్యతిరేకంగా పోస్టర్లు-తాజావార్తలు

* పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శనివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. నార్లాపూర్‌ వద్ద తొలి పంపు స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. డెలివరి సిస్టర్న్‌ వద్ద సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలు నింపిన కలశాలకు వేదపండితులు పూజలు చేశారు. కలశాలను పలుగ్రామాల సర్పంచ్‌లకు అధికారులు అందజేయనున్నారు. కృష్ణా జలాలతో పలు గ్రామాల్లో దేవుళ్లకు ప్రజాప్రతినిధులు పూజలు చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గుంటూరులో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ‘నేను సైతం-బాబు కోసం’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా శుభం కల్యాణ మండపం నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల వస్త్రాలు ధరించి, నల్ల బెలూన్లు పట్టుకుని పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, తెదేపా కార్యకర్తలు ప్రదర్శనలో పాల్గొన్నారు. వేధింపుల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని మహిళలు ధ్వజమెత్తారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేశారు. ‘బాబు తో నేను’ ప్లకార్డులు ప్రదర్శించారు.

* తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) పర్యటన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఆయనకు వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణకు నిధులు ప్రకటిస్తారా? అంటూ ప్రశ్నలతో వెలిసిన బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రహరీ గోడలకు పెద్ద ఎత్తున ఈ బ్యానర్లను కట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం పరేడ్ మైదానంలో జరిగే సభకు అమిత్ షా రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను సూటిగా ప్రశ్నిస్తూ బ్యానర్లు వెలిశాయి. గోవాకు రూ.300 కోట్లు ప్రకటించినప్పుడు తెలంగాణకు ప్రకటించారా? అంటూ ప్రశ్నించారు.

* భాజపా (BJP)కు వ్యతిరేకంగా జట్టుకట్టిన విపక్షాల ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)కి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ కూటమి వచ్చే నెల నిర్వహించతలపెట్టిన తొలి బహిరంగ సభ అనూహ్యంగా రద్దయ్యింది. దీంతో ప్రతిపక్షాలపై భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. అసలేం జరిగిందంటే.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఇటీవల ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. అక్టోబరు తొలివారంలో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ (Bhopal)లో తొలి బహిరంగ సభ (Public Rally) నిర్వహించాలని ఈ కమిటీ నిర్ణయించింది. ఈ సభలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతి, కులగణనలను ప్రస్తావించాలని ప్రణాళిక రచించింది. అయితే, ఈ బహిరంగ సభను రద్దు చేసినట్లు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌నాథ్ (Kamal Nath) శనివారం వెల్లడించారు. ‘‘ఈ ర్యాలీ జరగడం లేదు. రద్దయ్యింది’ అని విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.

* చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పాల్గొంటున్నారు.

* సీఎం జగన్‌ సలహాదారు అజేయకల్లం పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. వివేకా కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజేయకల్లం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌ను భారతి మేడపైకి పిలిచి ఏదో చెప్పారని తాను చెప్పినట్టు తప్పుగా సీబీఐ చెప్పిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ అజేయకల్లం విచారణ ఆడియో రికార్డింగ్‌ ను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించింది. ఆయన తీరుపై సీబీఐ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం వాంగ్మూలం నమోదు వేళ అజేయకల్లం సీఎం ప్రధాన సలహాదారుగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వంతో అనుబంధాన్ని అజేయకల్లం కూడా పిటిషన్‌లో అంగీకరించారు. ఆయన ప్రభావితమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పిటిషన్‌లో అజేయకల్లం పేర్కొన్న అంశాలు తర్వాత వచ్చిన ఆలోచనలే. అందుకే వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నారు. తన వాంగ్మూలంతో కొందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆరోపణలు ప్రేరేపితం, కల్పితం. వివేకా హత్యకేసులో స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేశాం. అజేయకల్లంతో పాటు పలువురు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశాం. వివేకా హత్యకేసులో అమాయకులను ఇరికించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. వివేకా హత్యకేసులో దర్యాప్తు ముగిసింది. అజేయకల్లం అంగీకారంతోనే ఆయన ఇంట్లోనే ఏప్రిల్‌ 24న వాంగ్మూలం నమోదు చేశాం. ఆయన్ను సాక్షిగా విచారణ జరిపాయం. చట్టప్రకారం వాంగ్మూలంనమోదు చేసి చదివి వినిపించాం. ఆయన చెప్పిన ప్రతిఅక్షరం నమోదు చేశాం. అందువల్ల ఆయన పిటిషన్ విచారణార్హం కాదు’’ అని సీబీఐ కౌంటరు పిటిషన్‌ దాఖలు చేసింది.

* చంద్రబాబు అరెస్టు.. తెదేపా ప్రచారంలో కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. జగన్ చేసిన అవినీతి గురించి అందరికీ తెలుసని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. వైకాపాతో పోరాటం చేసే పార్టీలు తెదేపా, జనసేనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. దిల్లీలో ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన లోకేశ్‌.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను పూర్తిగా తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

* దేవాలయాల్లో అర్చకులు, పూజారులు ఎక్కువగా మగవారే ఉంటారు. ఆడవారికి ఉండే నెలసరి సమస్యలు ఇతర కారణాలతో అర్చకత్వం వైపు వారిని సమాజం అడుగు వేయనివ్వలేదు. భగవంతుడికి సేవ చేయాలని ఉన్నా మగవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో మహిళలు వెనకడుగేసారు. అయితే ఈ రంగంలో ఆడవారికి కూడా అవకాశం కల్పించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి నాంది పలికింది కూడా డీఎంకే ప్రభుత్వమే. 2007లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిథి తొలిసారిగా ఓ మహిళను అర్చకురాలిగా నియమించగా.. ఇప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ మరో మహిళకు అవకాశం కల్పించారు. తాజాగా మరో ముగ్గురు మహిళలు అర్చకత్వాన్ని చేపట్టనున్నారు. మహిళలు అర్చకత్వంలోకి అడుగుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన శిక్షణనిస్తోండటం విశేషం. తాజాగా అర్చకత్వం శిక్షణ పూర్తి చేసిన మహిళలు శిక్షణ తీసుకుని గుడిలోకి అర్చకులుగా అడుగుపెట్టబోతున్నారు. అన్ని కులాలవారు అర్చకులు కావొచ్చన్న పథకం కింద తమిళనాడులో ఈ ముగ్గురు మహిళలు అర్చక శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇకపై వారంతా ఆలయాల్లో మూలమూర్తులకు పూజా కార్యక్రమాలు చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళలు కూడా ఇక గర్భగుడిలోకి.. అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోషల్‌మీడియాలో గురువారం పోస్ట్‌ చేశారు. ‘మహిళలు విమానం నడిపినా, అంతరిక్షానికి వెళ్లొచ్చినా వారు ప్రవేశించలేని ప్రదేశంగా ఆలయ గుర్భగుడి ఉంది. ఇకపై ఆ పరిస్థితి మారనుంది’ అని తెలిపారు.

* బాలీవుడ్‌ సినిమా నటుడు సునీల్‌ ష్రాఫ్‌ ఇక లేరు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. అయితే, సునీల్‌ ష్రాఫ్‌ మరణానికి కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన మరణానికి అదే కారణమై ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

* తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. శనివారం ఐటీ ఉద్యోగుల ఆందోళన అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పైకి చేరింది. నానక్‌రామ్‌ గూడ టోల్‌గేట్‌ నుంచి విడతల వారీగా ఓఆర్‌ఆర్‌పై కారు ర్యాలీకి వారంతా సిద్ధమయ్యారు

* తమిళనాడు, తెలంగాణలోని 31 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, మొబైళ్లు, లాప్‌టాప్‌లు సహా రూ.60 లక్షల నగదు, 18,200 యూఎస్ డాలర్లను స్వాధీనం చేసుకుంది. కోయంబత్తూర్‌లో 22 చోట్ల, చెన్నైలోని 3, టెంకాసీలోని ఓ ప్రాంతంతో పాటు హైదరాబాద్‌లోని 5 చోట్లలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది

* అరవై ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎందుకు విద్యుత్, నీళ్లు ఇవ్వలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ఒక్క క్షణం కోతలేని నిరంతర విద్యుత్ అందిస్తుందని ఆయన చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హరీశ్‌ పంపిణీ చేశారు.

* రైల్వే ప్రయాణికులకు శుభవార్త. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ (Vande Bharat sleeper) రైలు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. 2024 మార్చిలోనే దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో పాటు వందే మెట్రో (Vande Metro) రైలును సైతం వచ్చే ఏడాదే తీసుకురానున్నట్లు పేర్కొన్నాయి.

* మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. (child deaths ) వైద్యాధికారులతోపాటు స్థానిక నేతలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలోని నందుర్‌బార్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు నెలల్లో 179 మంది చిన్నారులు చనిపోయారు. జూలైలో 75 మంది పిల్లల మరణాలు నమోదయ్యాయి. ఆగస్టులో ఈ సంఖ్య 86కు పెరిగింది. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు 18 మంది చిన్నారులు చనిపోయారు.

* జిల్లాలోని ఇనుగుర్తి బాలిక‌ల‌ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం చోటు చేసుకోగా, విష‌యాన్ని బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా ప్రిన్సిపాల్ జాగ్ర‌త్త ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇనుగుర్తి బాలిక‌ల సాంఘిక సంక్షేమ హాస్ట‌ల్‌లో స్వ‌రూప అనే మ‌హిళ అటెండ‌ర్‌గా ప‌ని చేస్తోంది. అయితే ఆమెకు ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, అనారోగ్యంతో ఉన్నా సెలవు కావాలంటే ఇవ్వకుండా ఒత్తిడికి గురి చేయడం లాంటి వేధింపులకు ప్రిన్సిపాల్ పాల్ప‌డ్డారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధితురాలు శుక్ర‌వారం విష‌గుళికలు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఆమె ప్ర‌స్తుతం తొర్రూరులోని ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో కుటుంబ స‌భ్యులు చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. ప్రిన్సిపాల్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు స్వ‌రూప కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

* హైద‌రాబాద్‌లోని మ‌ధురాన‌గ‌ర్‌లో భారీ చోరీ జ‌రిగింది. వాస్తు నిపుణులు వీఎల్ఎన్ ఇంట్లో రూ. నాలుగు కోట్లను ఎత్తుకెళ్లారు. ఊరికి వెళ్లొచ్చేస‌రికి ఇంట్లో ఉన్న రూ. నాలుగు కోట్ల‌తో పాటు బంగారం చోరీకి గురైన‌ట్లు వీఎల్ఎన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఇల్లు కొనుగోలు కోసం జ‌మ చేసుకున్న డ‌బ్బులను మొత్తం చోరీ చేసిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

* శుక్రవారం రాత్రి జరిగిన సైమా-2023 వేడుకలకు దక్షిణాది తారా తోరణం అంతా ఒకటైంది. తెలుగు, కన్నడ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు అవార్డు ఫంక్షన్‌లో సందడి చేశారు. ఈ వేడుకకు దుబాయ్‌ వేదికైంది. ఇక ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికవుతారనే సస్పెన్స్‌కు తెర దించుతు తారక్‌ పేరును ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ టెర్రిఫిక్‌ పర్‌ఫార్మెన్స్‌కు ఈ అవార్డు వరించింది. ఇక అవార్డు గెలుచుకున్న ఎన్టీఆర్‌ తన స్పీచ్‌తో అభిమానులు హృదయాలను ఉద్వేగానికి గురిచేశాడు.