NRI-NRT

శైలజ కిరణ్‌పై లుకవుట్ నోటీసులకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు

శైలజ కిరణ్‌పై లుకవుట్ నోటీసులకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ది భారీ కుంభకోణమని, ఈ కేసులో వేలాది చందాదారుల ప్రయోజనాలు కాపాడటం తమ బాధ్యత అని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఇంత పెద్ద స్కాంలో నిందితులుగా ఉన్న రామోజీరావు(ఏ–1), శైలజ (ఏ–2) దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడంలేదని తెలిపింది.

మూడుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పింది. దర్యాప్తు అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, రికార్డులు చూపించడంలేదని తెలిపింది. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శైలజ దేశం దాటి వెళ్లారని, అందుకే ఆమెపై లుక్‌ అవుట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేయాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించింది. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే అమెరికా పర్యటనను సాకుగా ఎంచుకున్నారని పేర్కొంది.

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ సీహెచ్‌ శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్‌ కె.సురేందర్‌ విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లలో ఏపీ సీఐడీ కౌంటర్లు దాఖలు చేసింది. అనంతరం వాదన­ల­కు పిటిషనర్ల తరపు న్యాయ­వాది రెండు వారాల సమయం కోరడంతో న్యాయ­మూర్తి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.