NRI-NRT

నేను నవ్వింది జాహ్నవి గురించి కాదు

నేను నవ్వింది జాహ్నవి గురించి కాదు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని ఆ పోలీసు అధికారి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల ఆన్‌లైన్‌గా వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ వివాదంపై సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

న్యాయవాదులను ఉద్దేశిస్తూనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని అన్నారు. ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు నేను వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా తోటి అధికారికి ఫోన్‌ చేసి ఘటన గురించి చెప్పాను. అప్పటికి నా విధులు పూర్తయ్యాయి. అయితే బాడీక్యామ్‌ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను జరిపిన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్‌ అయ్యింది. అయితే, నేను కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే మాట్లాడాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’’ అని డేనియల్‌ తన లేఖలో వివరించారు.