Devotional

4 వేల మందితో పోలీసు బందోబస్తు

4 వేల మందితో పోలీసు బందోబస్తు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 4 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
సెప్టెంబరు 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. శ్రీవారి వాహన సేవలు ఊరేగింపు జరిగే మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించారు. గరుడ వాహన సేవలో భక్తుల రీఫిల్లింగ్ వ్యవస్థ, సెప్టెంబర్ 18, 19 తేదీలలో ముఖ్యమంత్రి పర్యటన కోసం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, వాహనసేవల దర్శనం కల్పించాలని సిబ్బందికి డీజీపీ సూచించారు. అనంతరం శ్రీవారి సేవా సదన్ సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. గరుడ సేవ నాడు అదనంగా వెయ్యి మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం, చిన్నారులకు జియో ట్యాగింగ్‌, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్‌ నిర్వహణ, వీఐపీలు, భక్తుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించామని చెప్పారు. మాడ వీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.