బ్రిటన్ సర్కార్ భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా ఫీజును పెంచేసింది. దాదాపు 127 పౌండ్ల వరకు ఫీజును పెంచారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి పెంచిన ఫీజులు అమలులోకి రానున్నాయి. దీనిపై బ్రిటీష్ పార్లమెంట్‌లో ఇటీవల చట్టం చేశారు. స్టూడెంట్ వీసా దరఖాస్తు ఫీజును 490 పౌండ్ల వరకు వసూల్ చేయనున్నట్లు యూకే హోం ఆఫీసు వెల్లడించింది. పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజును కూడా పెంచేశారు. విజిట్ వీసాపై 15 పౌండ్లు పెంచారు.
దీంతో ఇప్పుడు ఆ వీసా ఖరీదు 115 పౌండ్లు అయ్యింది. ఇది కేవలం ఆర్నెళ్ల విజిట్ వీసాకు మాత్రమే. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి కొత్త ఫీజులు అమలులోకి రానున్నట్లు యూకే ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది. 2021-2022 సీజన్‌లో భారత్ నుంచి సుమారు లక్షా 20 వేల మంది చదువు కోసం బ్రిటన్ వెళ్లారు. ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న విదేశీయుల్లో ఇండియన్ల సంఖ్యే ఎక్కువ. కీలకమైన సేవల్ని అందించేందుకు ఉద్దేశంతో ఫీజును పెంచినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. పెంచిన ఫీజులతో ప్రాధాన్యత రంగాలకు నిధులను కూడా పెంచవచ్చు అని ప్రభుత్వం అభిప్రాయపడింది.