Devotional

TTD: దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం

TTD: దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాలకు శాస్త్రోక్తంగా ఆదివారం అంకురార్పణ జరిపారు. ఏపీ సీఎం జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సోమవారం సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 గంటల నుంచి 6.30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం క్రతువు నిర్వహించనున్నారు. ధ్వజారోహణంతో సకల దేవతలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఎగురవేయనున్నారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నట్లు దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆన్‌లైన్‌లో 1.30 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం భక్తులకు 24వేల ఉచిత దర్శన టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 2లక్షల మంది భక్తులు వీక్షించేలా బ్రహ్మోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 22న గరుడ సేవ కారణంగా తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశామన్నారు. ఈ మేరకు భక్తులు గమనించాలని ఈవో కోరారు.

ఉత్సవాల సందర్భంగా వాహనసేవలు జరిగే మాఢవీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిద్దారు. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీవారి ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఈ నెల 22న గరుడవాహన సేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిసింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు వివరించింది.

ఇక 26న చక్రస్నానం కార్యక్రమం జరుగనుండగా.. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని, సంయమనంతో వ్యవహరించి స్నానమాచరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. సోమవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. కార్యక్రమం సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది. 26 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.