WorldWonders

ఆచూకీ దొరకని వందల కోట్ల ఫైటర్ జెట్-తాజావార్తలు

ఆచూకీ దొరకని వందల కోట్ల ఫైటర్ జెట్-తాజావార్తలు

* అమెరికా(USA)లో వందల కోట్ల విలువైన ఫైటర్‌ జెట్ మిస్‌(F-35 Fighter Jet) అయ్యింది. దాని జాడ కనిపిస్తే చెప్పాలంటూ మిలిటరీ అధికారులు ప్రజలను అభ్యర్థించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. గాల్లో ఉండగా అత్యవసర పరిస్థితి తలెత్తడంతో.. సౌత్‌ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి అమెరికా ఫైటర్ జెట్‌ ఎఫ్‌-35(F-35 Fighter Jet) జాడ లేకుండా పోయింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. దాని విలువ రూ. వందల కోట్లలో ఉంటుంది. ఇప్పుడు అది మిస్‌ కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. పోర్టు నగరమైన చార్లెస్టన్‌లో ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్‌తో కలిసి దానిని వెతుకుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ నగరంలోని రెండు సరస్సులను గాలిస్తున్నారు. అలాగే ఈ విషయంలో స్థానికులు సహకరించాలని కోరారు. దానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే వెల్లడించాలని అభ్యర్థించారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ట్రాకింగ్‌ పరికరం ఎక్కడికిపోయిందంటూ పలువురు నేతలు ప్రశ్నించారు.

* పార్లమెంట్‌ ‘ప్రత్యేక’ సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభ (Lok Sabha)లో ప్రసంగించారు. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో పాత భవనంలో పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రధాని.. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘తెలంగాణ (Telangana) ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. కానీ, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఆ మూడు రాష్ట్రాల విభజన సమయంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదు. ఈ విభజన ఏపీ, తెలంగాణ ఇరు వర్గాలనూ సంతృప్తిపర్చలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయి. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేకపోయింది’’ అని మోదీ తెలిపారు.

* అదానీ గ్రూప్‌- హిండెన్‌బర్గ్‌ (Adani- Hindenburg) వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో (Supreme court) ఓ పిటిషన్‌ దాఖలైంది. కమిటీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారంటూ అనామికా జైశ్వాల్‌ సోమవారం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కాబట్టి కొత్త ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అదానీ గ్రూప్‌.. షేర్ల అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై నియంత్రణ సంస్థల వైఫల్యం లేదంటూ ఈ కమిటీ గతంలో నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారంటూ పిటిషనర్‌ పేర్కొనడం గమనార్హం. ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీలో ఒకరైన ఓపీ భట్‌.. 2006 నుంచి 2011 వరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (SBI) ఛైర్మన్‌గా వ్యవహరించారని జైశ్వాల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పునరుత్పాదక ఇంధన సంస్థ గ్రీన్‌కోకు హెడ్‌గా ఉన్నారని తెలిపారు. అదానీ నెలకొల్పబోయే ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌కు వెయ్యి మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని సరఫరా చేస్తామని ఈ కంపెనీ 2022 మార్చి 14న ఓ పత్రికా ప్రకటనను జారీ చేసిందని, ఇరు సంస్థల మధ్య దావోస్‌లో అవగాహన ఒప్పందం కూడా కుదిరిందని పేర్కొన్నారు. విజయ్‌ మాల్యాకు రుణాలు జారీ చేసిన కేసులోనూ భట్‌ను 2018 మార్చిలో సీబీఐ ప్రశ్నించిందని తన పిటిషన్‌లో ప్రస్తావించారు.

* వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్‌ (Pragathi Bhavan)లో ఘనంగా నిర్వహించారు. ప్రగతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహానికి సీఎం కేసీఆర్‌, శోభ దంపతులతో పాటు మంత్రి కేటీఆర్‌, శైలిమ దంపతులు, పలువురు భారాస నేతలు పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు విఘ్నేశ్వరుడు సుఖశాంతులను అందించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కోరారు. విఘ్నాలు తొలగించి ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఎలాంటి విఘ్నాలూ రాకుండా చూడాలని ప్రార్థించారు.

* శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మలయప్ప స్వామి వారి సమక్షంలో గరుడ ధ్వజాన్ని ఎగరవేశారు. వేదపండితుల మంత్రాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించే పెద్దశేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు.

* పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో (Parliament Session) తొలి రోజు ముగిసింది. తొలిరోజు సమావేశాల అనంతరం ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. మంగళవారం నుంచి పార్లమెంట్‌ కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు సమావేశం కానుండగా.. రాజ్యసభ 2.15 గంటలకు పార్లమెంట్‌ కొత్త భవనంలో సమావేశం కానుంది. మిగిలిన నాలుగు రోజుల పాటు కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేక సమావేశాలకు వేదిక కానుంది. ఈ సమావేశాల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారన్న అంశంపై ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతోంది.

* తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం సంస్కారహీనమని అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని మోదీ వ్యాఖ్యలను ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని దుయ్యబట్టారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చడం సబబు కాదని అన్నారు.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన వ్యవహారం పార్లమెంట్‌ను తాకింది. ముందస్తు ప్లాన్‌లో భాగంగా ప్రత్యేక సమావేశాల్లో సోమవారం టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్‌ను హైలైట్‌ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు సైతం గట్టి కౌంటరే ఇచ్చారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని, ఇందులో చంద్రబాబు ప్రమేయం నిరూపితమైందని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. స్కిల్‌ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, ఆ అరెస్ట్‌ ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా స్పందించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. ఆ సమయంలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసులో చోటు చేసుకున్న పరిణామాలను లోక్‌సభకు వివరించారాయన. ఇది పూర్తిగా అవినీతి కేసు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యింది. రూ.371 కోట్ల లూటీ జరిగింది. అన్ని ఆధారాలు ఉన్నందునే ఆయన అరెస్ట్‌ జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు అవినీతిని.. స్టేల ద్వారా తప్పించుకుంటూ రాగలిగారు. చిట్టచివరకు చంద్రబాబు చట్టానికి చిక్కారు. ఐటీ కేసులో చంద్రబాబు సైతం నోటీసులు అందుకున్నారు. చంద్రబాబు పీఏకు సైతం ఐటీ నోటీసు ఇవ్వగా.. ఆయన విదేశాలకు పారిపోయారు. ఈ కేసులో దోచిన మొత్తాన్ని 80 షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేలిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు.

* ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌.. తన పార్టీ తరుపున ఆ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్‌ నాయక్‌కు సాలిడ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నియోజకవర్గంలో రేఖా నాయక్‌ ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. తాను గెలిచాక చేస్తానని జాన్సన్‌ ప్రచారం చేస్తుండడంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు గనుక ప్రచారం చేస్తే.. నడిరోడ్డుపై కొట్టేందుకు కూడా వెనకాడబోనని హెచ్చరించారామె. తానింక బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని రేఖా నాయక్‌.. రెబల్‌గా అయినా పోటీ చేసి తీరతానని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటివరకు రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారని.. చేసిన సేవలు నచ్చితే మూడోసారి రెబల్‌గా కూడా తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారామె. ‘‘రాథోడ్‌ రమేష్‌ నాపై దాడి కోసం వస్తే.. ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం అభ్యర్థి అయిన జాన్సన్‌ నాయక్‌ విషయంలో ఏ హోదాతో సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు ప్రొటోకాల్‌ పాటిస్తున్నారు. ఆయన కేవలం అభ్యర్థి మాత్రమే కదా’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారామె.

* కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి. పెన్పహాడ్ మండల కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తుక్కుగూడ సభలో ప్రకటించిన ప్రతి గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు రఘువీరారెడ్డి.

* లోక్ సభ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అన్నారు. ఎన్నికలకు ఇండియా కూటమి ఎప్పుడైనా సిద్ధంగా ఉందన్నారు. సోమవారం (సెప్టెంబర్ 18న) జరిగిన మీడియా సమావేశంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై విమర్శలు చేశారు.

* వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబుకు, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైకాపా నన్ను సస్పెండ్‌ చేసింది. త్వరలోనే తెదేపాలో చేరతా. చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఇప్పటికే పార్టీలో చేరేవాడిని. చేరికపై జవాబు వచ్చాక పార్టీలో అధికారికంగా చేరతా’’ అన్నారు.

* తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో సీఐడీ అధికారుల తీరుపై మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సీఐడీ విచారణ అధికారులా లేక వైకాపా అధికార ప్రతినిధులా? అని ప్రశ్నించారు. విజయవాడలో 2 సార్లు, హైదరాబాద్‌లో ఒకసారి, దిల్లీలో మరోసారి ప్రెస్‌మీట్‌లు ఎలా పెడుతారని నిలదీశారు.

* తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించారని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. తప్పులు చేసిన నాయకులే ఆయన్ను ఈ కేసులో ఇరికించారన్నారు.

* తెలంగాణలో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. అక్టోబర్‌ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.

* క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ థియేటర్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. రూ.34 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ రోబోటిక్ థియేటర్ ద్వారా ఎంతోమంది రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్నారు.

* ఏపీ గవర్నర్‌(AP Governor) జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(Abdul Nazeer) అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో ఆయన చేరారు. కడుపు నొప్పి కారణంగా గవర్నర్‌ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. రాజ్‌భవన్‌ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు విజయవాడ వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.