Business

పన్ను వసూళ్లలో 23 శాతం పెరుగుదల-వాణిజ్యం

పన్ను వసూళ్లలో 23 శాతం పెరుగుదల-వాణిజ్యం

* నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Net direct tax collection) ఇప్పటి వరకు రూ.8.65 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 23.51 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. కార్పొరేట్ల నుంచి అధిక ముందస్తు పన్ను (Advance tax) వసూళ్లు.. వృద్ధికి దోహదం చేసినట్లు పేర్కొంది. 2023 సెప్టెంబరు 16 నాటికి వసూలైన రూ.8,65,117 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను (Net direct tax collection)ల్లో రూ.4.16 లక్షల కోట్లు కార్పొరేట్‌ ఆదాయపు పన్ను (corporate income tax) కాగా, రూ.4.47 లక్షల కోట్లు వ్యక్తిగత పన్ను ఆదాయం (personal income tax). ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల (Net direct tax collection)లో 23.51 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. దీంట్లో ముందస్తు పన్ను వసూళ్లు రూ.3.55 లక్షల కోట్లు. క్రితం ఏడాది నమోదైన రూ.2.94 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి 21 శాతం వృద్ధి నమోదైంది. రూ.3.55 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లలో రూ.2.80 లక్షల కోట్లు కార్పొరేట్‌ పన్నుల ఆదాయం కాగా.. రూ.74,858 కోట్లు వ్యక్తిగత పన్ను ఆదాయం. సెప్టెంబరు 16 నాటికి రూ.1.22 లక్షల కోట్ల రిఫండ్లను సర్దుబాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. స్థూలంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.87 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన ఇది 18.29 శాతం అధికం. కార్పొరేట్‌, వ్యక్తిగత ఆదాయంపై వసూలు చేసే పన్నులు ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం నిదర్శనంగా చెబుతుంటారు.

* ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి కొన్ని ప్రయోజనాలకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది. దీంతో లక్షలాది మంది ఏజెంట్లు, లక్షకు పైగా ఉన్న ఎల్‌ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎల్‌ఐసీ ఏజెంట్లకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వారిక ప్రయోజనాలు అందించే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే రీ అపాయింట్‌ అయిన ఏజెంట్లకూ రెన్యువల్ కమీషన్‌ పొందేందుకు అర్హత కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుతం పాత ఏజెన్సీలో బిజినెస్‌ పూర్తి చేసిన వారికి రెన్యువల్‌ కమీషన్‌ అందడం లేదు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీల్లో రెండు వారాల లాభాల జోరుకు సోమవారం బ్రేక్‌ పడింది. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మరోవైపు వరుస లాభాల నేపథ్యంలో కొన్ని కీలక స్టాక్స్‌లో లాభాల స్వీకరణ కనిపించింది. రూపాయి పతనం, విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల సైతం సూచీలను కిందకు లాగాయి. ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 67,665.58 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67,537.04 వద్ద కనిష్ఠాన్ని తాకింది. 67,803.15 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 273.52 పాయింట్ల నష్టంతో 67,565.11 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 20,155.95 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20,195.35 దగ్గర గరిష్ఠాన్ని, 20,115.70 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 59.05 పాయింట్లు నష్టపోయి 20,133.30 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.27 వద్ద నిలిచింది. రూపాయికి ఇప్పటి వరకు ఇదే జీవనకాల కనిష్ఠ ముగింపు కావడం గమనార్హం.

* ఇటీవల విడుదలైన ఐఫోన్‌ 15 (iPhone 15) ప్రీఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 22 నుంచి ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే, కొన్ని మోడళ్ల కోసం దాదాపు రెండు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సిరీస్‌లో టాప్‌ మోడల్‌ అయిన ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max)లో బ్లూ టైటానియం, బ్లాక్‌ టైటానియం కలర్‌ వేరియంట్లు అక్టోబర్‌ మూడోవారంలో కొనుగోలుదారుల చేతికి రానున్నాయి. నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం వేరియంట్ల కోసమైతే నవంబర్‌ రెండోవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌ది సైతం ఇదే పరిస్థితి. వేరియంట్లతో సంబంధం లేకుండా ఈ మోడల్‌ మొత్తం అక్టోబర్‌ మూడో వారం నుంచి అందుబాటులోకి రానుంది. అయితే, ఈ మోడల్‌లో 1టీబీ స్టోరేజ్‌ వైట్‌ టైటానియం కలర్‌ వేరియంట్‌కు మాత్రం మినహాయింపు ఉంది. ఈ ఫోన్‌ సెప్టెంబర్‌ 22 నుంచే వినియోగదారులకు లభించనుంది. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ బేస్‌ మోడళ్ల డెలివరీ సైతం కొంచెం ఆలస్యం కానుంది. సెప్టెంబరు ఆఖర్లో లేదా అక్టోబర్‌ మొదటివారంలో ఇది కొనుగోలుదారులకు లభించనున్నట్లు యాపిల్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది.

* అత్యవసర సమయాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి గట్టెంక్కించేవి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకొనే రుణాలు. ముఖ్యంగా సులభంగా మంజూరయ్యే పర్సనల్ లోన్లు, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ రెండూ ఒకేలా ఉంటాయి గానీ రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. పర్సనల్ లోన్ అనేది అసురక్షిత రుణం. దీనికి ఎటువంటి తనఖా పత్రాలు ఉండవు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం మీ సిబిల్ స్కోర్ ఆధారంగా మంజూరు చేసే రుణం ఇది. కాగా ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీ అకౌంట్ లో ఉన్న మొత్తం కంటే ఎక్కువ నగదును రుణంగా పొందడం అన్న మాట. మీరు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని ఆలోచన చేస్తుంటే.. ముందు ఆ రెండింటి మధ్యలో ఉన్న తేడాలను గమనించాలి. ఆ తర్వాత ఏది బెస్ట్ అని అంచనాకు రావొచ్చు. వ్యక్తిగత రుణం అంటే.. బ్యాంకులు ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకు కొంత కాలానికి కొలేటరల్‌కు వ్యతిరేకంగా కొంత మొత్తాన్ని అందించే రుణాన్ని వ్యక్తిగత రుణం అంటారు. రుణగ్రహీతలు విధించిన వడ్డీలతో పాటు కొంత వ్యవధిలో రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. వ్యక్తిగత రుణం పొందేందుకు బ్యాంకులకు ఎలాంటి పూచీకత్తు అవసరం ఉండదు. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అంటే.. రుణదాత, దరఖాస్తుదారు మధ్య ఒక ఒప్పందం, దీని ద్వారా వారి ప్రస్తుత బ్యాంక్ ఖాతాలలో అందుబాటులో ఉన్న దాని కంటే ఎక్కువ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.