Movies

పట్టుదలకు ప్రతీక…అక్కినేని. జయంతి ప్రత్యేకం.

పట్టుదలకు ప్రతీక…అక్కినేని. జయంతి ప్రత్యేకం.

వాస్తవానికి ఎన్టీఆర్‌ వయసులో 15 నెలలు పెద్దవాడైనా, సినిమాల్లో ఆయనకంటే సీనియర్‌ ఏఎన్నార్‌. 90 ఏళ్ల తన జీవితంలో 250కు పైగా చిత్రాలతో ఏడు పదుల కాలం వెండితెరపై అలరించిన నటుడు బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు. 16 ఏళ్ల వయసులో పుల్లయ్య చిత్రం ‘ధర్మపత్ని’లో చిన్నవేషం వేసినా.. అక్కినేని సినీయాత్ర మొదలైంది మాత్రం 1944లో వచ్చిన ‘శ్రీ సీతారామ జననం’ చిత్రంతోనే. అంతకుముందు నాటకాల్లో ఆడవేషాలు వేస్తూ ఒక్కో ప్రదర్శనకు రూ.5 చొప్పున నెలకు అయిదారు నాటకాల్లో నటించేవారు. ఈ క్రమంలో తెనాలిలో నాటక ప్రదర్శన ముగించుకొని గుడివాడ వెళ్లేందుకు బెజవాడ రైల్వేస్టేషనులో సామాను మోసుకుపోతున్న అక్కినేనిని అదే రైలు ఫస్ట్‌క్లాస్‌ కంపార్టుమెంటులో ప్రయాణిస్తున్న ఘంటసాల బలరామయ్య చూశారు. వివరాలు ఆరా తీసి, తాను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’ చిత్రంలో రాముడి పాత్ర ఇచ్చారు. అలా అక్కినేని సినీ జీవితానికి శ్రీకారం చుట్టిన బలరామయ్య మరెవరో కాదు, నేటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ తాతగారే. దగ్గరుండి తన పెళ్లి సైతం జరిపించిన బలరామయ్యను ఏఎన్నార్‌ తండ్రిలా గౌరవించేవారు.

1944 మే 8న మద్రాసులో అడుగుపెట్టిన అక్కినేని తొలిరోజుల్లో చాలా పీలగా ఉండేవారు. ఆడనడక అంటూ కొందరు హేళన కూడా చేశారు. దీంతో కొన్ని పాత్రలకు ఆయనకు లోపల ప్యాడింగ్‌ వేసేవారు. ఏఎన్నార్‌ పేరు తెలుగునేలపై మారుమోగేలా చేసిన తొలిచిత్రం ‘బాలరాజు’. ఆ తర్వాత ‘కీలుగుర్రం’ లాంటి చిత్రాలతో ఆ పేరు స్థిరపడిపోయింది. మాలపిల్ల, రైతుబిడ్డ లాంటి గొప్ప చిత్రాలు తీసిన గూడవల్లి రామబ్రహ్మం అక్కినేనితో ‘మాయలోకం’, ‘పల్నాటియుద్ధం’ చిత్రాలు తీశారు. వీరిద్దరి పరిచయం విచిత్రంగా జరిగింది. బలరామయ్య పరిచయం చేసినపుడు అక్కినేని కనీసం నమస్కారం కూడా పెట్టలేదని గూడవల్లి చిన్నబుచ్చుకున్నారు. దీంతో ఏఎన్నార్‌కు మరో పెద్దదిక్కుగా ఉన్న దుక్కిపాటి మధుసూదనరావు (ఈయన వారి నాటక సమాజ కార్యదర్శి) చొరవ తీసుకొని ‘‘పల్లెటూరివాడు.. పట్నం మర్యాదలు పెద్దగా తెలియదు’’ అంటూ సర్దిచెప్పారు. ఆ తర్వాత గూడవల్లి తన ఇంట్లో ఆశ్రయమిచ్చి మరీ అక్కినేనిని ప్రోత్సహించారు. వరుసగా 14 జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించాక తొలి సాంఘిక చిత్రమైన ‘సంసారం’ పెద్ద హిట్‌ అయింది.

ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. భరణి సంస్థలో భానుమతితో కలిసి నటించిన ‘లైలామజ్ను’, ‘విప్రనారాయణ’, ‘బాటసారి’ గొప్ప చిత్రాలుగా నిలిచాయి. అన్నపూర్ణ చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించిన అక్కినేని సొంత సంస్థలో తొలిచిత్రాన్ని దర్శక మేధావి కె.వి.రెడ్డితో తీయాలని దాదాపు మూడేళ్లు నిరీక్షించి నిర్మించిన ‘దొంగరాముడు’ (1955) ఘనవిజయం సాధించింది. కె.వి.రెడ్డి తీసిన కళాఖండం ‘మాయాబజార్‌’లో అభిమన్యుడి పాత్ర కూడా ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టింది. నాస్తికుడైన అక్కినేని ‘భక్తతుకారాం’, ‘చక్రధారి’ లాంటి భక్తిరస చిత్రాల్లో నటించి మెప్పించడం నటన పట్ల తన అంకితభావానికి నిదర్శనం. జగపతి సంస్థ నిర్మించిన ‘దసరా బుల్లోడు’ చిత్రంతో తెలుగు సినిమాల్లో నృత్యాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే. ‘మిస్సమ్మ’, ‘గుండమ్మకథ’, ‘మూగమనసులు’, ‘ప్రేమనగర్‌’ లాంటి చిత్రాలు ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్స్‌గా నిలిచాయి. మిస్సమ్మలో ఎన్టీఆర్‌ ప్రధానపాత్ర పోషించగా, తమిళ వెర్షనులో హాస్యనటుడు తంగవేలు పోషించిన పాత్రను అక్కినేని కోరి నటించారు. వైవిధ్యానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యానికి ఇది మచ్చుతునక.
బి.ఎన్‌.రెడ్డి సలహాతో ఆంగ్లంపై పట్టు

నాలుగో తరగతి వరకే చదివి సినిమాల్లోకి వచ్చిన అక్కినేని చక్కగా ఇంగ్లిషులో మాట్లాడే స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో అవమానాలు, పట్టుదల ఉన్నాయి. దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి సలహాతో శంకర నారాయణ నిఘంటువు దగ్గర పెట్టుకొని రోజూ ‘ది హిందూ’ పత్రిక చదివేవారు. ఆంగ్లం నేర్పే ట్యూటర్‌ను కూడా పెట్టుకున్నారు. 1964 ప్రాంతంలో వంద రోజులు యూరప్‌ పర్యటనకు వెళ్లిన ఏఎన్నార్‌ అక్కడి నుంచి తిరిగివచ్చాక విమానాశ్రయంలో దాదాపు గంటసేపు మీడియావాళ్లతో ఆంగ్లంలో మాట్లాడటం చూసి ఆయన సన్నిహితులు సైతం నోరెళ్లబెట్టారు. సినీజీవితంలో ‘పద్మవిభూషణ్‌’ వంటి అత్యుత్తమ అవార్డులెన్నో ఆయన పొందినా, దాదాపు 200 మంది సంస్కృత పండితులు ఎంపికచేయగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన ‘కాళిదాసు కౌస్తుభ్‌’ అవార్డు తనకెంతో ఇష్టమని చెప్పేవారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో పోషించిన ‘మహాకవి కాళిదాసు’ పాత్రతో ఈ అవార్డు వరించింది.

నటుడిగా పేరొచ్చాక ఎంతోమంది కొత్త దర్శకులతో ఏఎన్నార్‌ నటించినా.. దాసరి నారాయణరావు కాంబినేషనుకు ఓ ప్రత్యేకత ఉంది. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం 500 రోజులకు పైగా ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. అక్కినేని నటించిన 200వ చిత్రం ‘మేఘసందేశం’ సైతం దాసరి తీసిందే. చివరి రోజుల్లో తొలిసారిగా విగ్గు లేకుండా క్రాంతికుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ పదికాలాలపాటు గుర్తుండే చిత్రం. కుమారుడు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించగా 2014లో వచ్చిన ‘మనం’ అక్కినేని ఆఖరిచిత్రం.

నట జీవితంలో తనకు గొప్ప విజయాన్ని అందించిన దేవదాసు చిత్రానిది ఓ ప్రత్యేకముద్ర అనేవారు అక్కినేని. నృత్య దర్శకుడిగా ఉన్న వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో శరత్‌ నవల ‘దేవదాసు’ను చిత్రంగా తీస్తున్నట్లు ప్రకటించాక ఎన్నో విమర్శలు వచ్చాయట. అప్పటికి సావిత్రి కూడా కొత్త నటి. నిర్మాత డి.ఎల్‌.నారాయణ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉండేవారు. అప్పటికే హిందీలో ప్రముఖ గాయకుడు కె.ఎల్‌.సైగల్‌ హీరోగా ఈ చిత్రం వచ్చింది. రెఫరెన్సు కోసం ఆ చిత్రాన్ని చూస్తానని అక్కినేని చెప్పినా.. మేమంతా ఉన్నాంగా అంటూ ధైర్యం చెప్పి ప్రేమతో డీఎల్‌ వారించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తీసిన ‘దేవదాసు’ బడ్జెటు రూ.4 లక్షలు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే. రెండు భాషల్లో హీరోగా నటించిన అక్కినేనికి విడతలవారీగా రూ.పాతిక వేలు ఇచ్చారు. 50 రోజులు రాత్రిపూట షూటింగు చేసిన ఈ చిత్రంలో మత్తుకళ్ల ఎఫెక్టు తీసుకురావడం కోసం ఏఎన్నార్‌ భోజనం మానుకొని నటించినట్లు అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ మాట నిజం కాదని, మీగడ పెరుగు వేసుకొని మరీ సుష్టుగా భోజనం చేసి నటించినట్లు అక్కినేని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలా తినడం వల్ల నిద్ర ముంచుకువచ్చేదని, తన మత్తుకళ్ల రహస్యం అదేనని వివరించేవారు. శరత్‌ రాసిన ఈ నవల ఆధారంగా పలు భాషల్లో ఇప్పటికి 10 – 12 సినిమాలు తీసినా.. నవలను యధాతథంగా చిత్రీకరించిన దిలీప్‌కుమార్‌ దేవదాసంటే తనకు ఇష్టమని అక్కినేని చెప్పేవారు.