DailyDose

స్నాక్స్‌ కొంటే కూల్‌డ్రింక్స్‌ ఫ్రీ!

స్నాక్స్‌ కొంటే కూల్‌డ్రింక్స్‌ ఫ్రీ!

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై శీతల పానీయాలను క్యాన్స్‌లో అందించబోమని తెలిపింది. దానికి బదులు స్నాక్స్‌తో పాటు కాంప్లిమెంటరీగా గ్లాసు జ్యూస్‌ను, కోక్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భాజపా రాజ్యసభ సభ్యుడు స్వపన్‌ దాస్‌గుప్తా చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఇండిగో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
భాజపా ఎంపీ స్వపన్‌దాస్‌ గుప్తా తాజాగా ఇండిగో సంస్థపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియాకు ఫిర్యాదు చేశారు. ఇండిగో విమానాల్లో శీతల పానీయాల పేరిట దోచుకుంటున్నారని, పైగా బలవంతంగా స్నాక్స్‌ కొనిపిస్తున్నారని ఎక్స్‌ వేదికగా ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు దోపిడీని అరికట్టి విమాన ప్రయాణికులకు ఊరట కల్పించేలా నిబంధనలు మార్చాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఇండిగో తన మెనూను సవరించింది. ‘‘ఇంతకుముందు మా మెనూలో క్యాష్యూ రూ.200, కోక్‌ రూ.100గా ఉండేది. మొత్తం రూ.300 చెల్లించాల్సి వచ్చేది. తాజాగా మెనూను సవరించాం. ఇకపై మీకు కావాల్సిన స్నాక్స్‌ కొనుగోలుపై (రూ.200) గ్లాసు శీతల పానీయాన్ని లేదా కోక్‌ను ఉచితంగానే అందించనున్నాం. అలాగే ఆన్‌బోర్డు సర్వీసులు పూర్తిగా కస్టమర్ల ఎంపికకు అనుగుణంగా ఉంటుంది’’ అని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. గోగ్రీన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. దేశీయ ఎయిర్‌లైన్‌ మార్కెట్‌లో ఇండిగోనే మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది.