‘ఖుషి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు సమంత. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా పూర్తయిన వెంటనే సమంత అమెరికాకు పయనమయ్యారు. ‘మయోసైటిస్’కు చికిత్సతో పాటు, అక్కడ వివిధ ప్రదేశాల్లో విహరిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
మీ తర్వాతి ప్రాజెక్ట్‌లు ఏంటి?
సమంత: ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవు. ఇక నుంచి కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా. నాకు నప్పే కథలతోనే సినిమాలు చేయాలనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూద్దాం! నా కంఫర్ట్ జోన్ దాటి భిన్నమైన కథలు చేయాలి’’
మీ చర్మం ఇంత కాంతివంతంగా ఎలా ఉంది?
సమంత: మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నా. చర్మ సంబంధ సమస్యలతో ఇబ్బందిపడ్డా. విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చింది. చిన్మయి నన్ను గ్లాసీగా చేస్తానని చెప్పింది. (చిన్మయి శ్రీపాద ఎక్కడ ఉన్నావ్!)
మీ నుంచి పూర్తి యాక్షన్ మూవీ చూడాలనుకుంటున్నా!
సమంత: నాకు కూడా యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. సిటాడెల్‌లో యాక్షన్ చూడవచ్చు. నా పాత్ర హాట్‌గా, ఫన్నీగా ఉంటుంది. ఎంతో ఛాలెంజ్‌తో ఆ పాత్ర చేశా. మీ అందరికీ నచ్చుతుంది. భవిష్యత్‌లో తప్పకుండా చేస్తా!
మీ జీవితానికి సంబంధించిన మూడు అంశాలను చెప్పండి. వాస్తవానికి దగ్గరగా ఉండాలి!
సమంత: 1. నేను ఏదైనా సాధిస్తాను. 2. పరిస్థితులేంటి ఇలా ఉన్నాయని ప్రశ్నించడం మానేసి, యథాతథంగా స్వీకరిస్తా. 3.నీతి, నిజాయతీతో ముందుకు సాగుతా.
జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్న యువతకు మీరిచ్చే సలహా ఏంటి?
సమంత: చిన్న చిన్న వాటికే ‘నా జీవితం ఇలా అయిపోయింది అనుకోవద్దు’. ఇప్పుడే మీ జీవితం మొదలైంది. మీ ప్రయాణంలో మీకు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. కొన్నిసార్లు అవే మనల్ని రాటు దేలుస్తాయి. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు. జీవితంలో ఇన్ని ఇబ్బందులు పడతానని కూడా ఊహించలేదు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సిటడెల్’. వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ‘సిటాడెల్’ అమెరికన్ టీవీ సిరీస్‌కు స్ఫూర్తిగా ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.