Business

రాజీనామా చేసిన బైజూస్ వ్యవస్థాపకుడు

రాజీనామా చేసిన బైజూస్ వ్యవస్థాపకుడు

ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ ఇండియా సీఈఓ, వ్యవస్థాపక భాగస్వామి మృణాల్‌ మోహిత్‌ ఆ సంస్థకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన వైదొలిగినట్లు కంపెనీ పేర్కొంది. ఆయన స్థానంలో బైజూస్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ సీఈఓ అర్జున్‌ మోహన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో భాగంగా సీఈఓ బాధ్యతల నుంచి మృణాల్‌ తప్పుకొన్నట్లు బైజూస్ ఓ ప్రకటనలో తెలిపింది. బైజూస్‌ ఈ స్థాయికి రావడానికి మృణాల్‌ సహకారం మరిచిపోలేనిదని బైజూస్‌ గ్రూప్‌ సీఈఓ రవీంద్రన్‌ పేర్కొన్నారు. బైజూస్‌ వ్యవస్థాపక బృందంలో మృణాల్‌ మోహిత్‌ ఒకరు. ప్రస్తుతం నియమితులైన మోహన్‌, మోహిత్‌ ఇద్దరూ రవీంద్రన్‌ విద్యార్థులే. దాదాపు 10 ఏళ్ల పాటు బైజూస్‌లో సేవలందించిన మృణాల్‌.. సంస్థను వీడారు. బైజూస్‌ వ్యాపార సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఓ వైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు మోహన్‌ గతంలో బైజూస్‌ టీమ్‌లో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. తర్వాత అప్‌గ్రాడ్‌లో చేరి ఈ ఏడాది జులైలో మళ్లీ పాత సంస్థలో జాయిన్‌ అయ్యారు.