Sports

Asia Games 2023: వాలీబాల్‌లో అదరగొట్టిన ఇండియా

Asia Games 2023: వాలీబాల్‌లో అదరగొట్టిన ఇండియా

మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల వాలీబాల్‌ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. గ్రూప్‌ ‘సి’లో టాప్‌ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. మంగళవారం కంబోడియా జట్టును ఓడించిన భారత జట్టు బుధవారం పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా జట్టును భారత్‌ బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 25–27, 29–27, 25–22, 20–25, 17–15తో దక్షిణ కొరియాపై గెలిచింది. 1966 నుంచి ప్రతి ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో ఏదో ఒక పతకం సాధిస్తూ వస్తోంది. భారత జట్టు చివరిసారి 1986 సియోల్‌ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచింది. కొరియాతో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అమిత్‌ అత్యధికంగా 24 పాయింట్లు స్కోరు చేశాడు. వినిత్‌ కుమార్, అశ్వల్‌ రాయ్‌ 19 పాయింట్ల చొప్పున సాధించారు. మనోజ్‌ ఎనిమిది పాయింట్లు, ఎరిన్‌ వర్గీస్‌ ఏడు పాయింట్లు అందించారు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కొరియా రజత పతకం నెగ్గగా, భారత్‌ 12వ స్థానంలో నిలిచింది.

రోయింగ్‌లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. జస్విందర్‌ సింగ్, భీమ్‌ సింగ్, పునీత్‌ కుమార్, ఆశి‹Ùలతో కూడిన భారత పురుషుల జట్టు కాక్స్‌లెస్‌ ఫోర్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరింది. మహిళల కాక్స్‌డ్‌ ఎయిట్‌ ఈవెంట్‌లో అశ్వతి, మృణమయి సాల్గావ్‌కర్, ప్రియా దేవి, రుక్మిణి, సొనాలీ, రీతూ, వర్ష, తెన్‌దోన్‌తోయ్‌ సింగ్, గీతాంజలిలతో కూడిన భారత జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది.

మహిళల టి20 క్రికెట్‌లో భారత నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. మలేసియాతో నేడు జరిగే పోరులో స్మృతి మంధాన బృందం బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడంతోపాటు పతకం రేసులో నిలుస్తుంది. ఉదయం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.