Sports

భారత్‌లో టెన్నిస్ దౌర్భాగ్యాన్ని వివరించిన నెం.1 ఆటగాడు

భారత్‌లో టెన్నిస్ దౌర్భాగ్యాన్ని వివరించిన నెం.1 ఆటగాడు

అతను భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు… ఏడాది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏటీపీ టోర్నీలలో పాల్గొంటున్నాడు. టోర్నీల్లో ప్రదర్శనకు ప్రైజ్‌మనీ కూడా దక్కుతుంది. మామూలుగా అయితే టెన్నిస్‌ ఆటగాళ్లు బాగా డబ్బున్నవాళ్లు అయి ఉంటారని, ఏ స్థాయిలో ఆడినా విలాసవంతమైన జీవితం ఉంటుందనిపిస్తుంది. కానీ ప్రపంచ టెన్నిస్‌లో వాస్తవ పరిస్థితి వేరు. అది ఎంత ఖరీదైందో… అగ్రశ్రేణి స్టార్లు తప్ప 100 కంటే ఎక్కువ ర్యాంక్‌ ఉన్న ఆటగాళ్ల స్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చెప్పేందుకు ఇది చక్కటి ఉదాహరణ! భారత్‌కు చెందిన ప్రపంచ 159వ ర్యాంకర్‌ సుమీత్‌ నగాల్‌ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

తన బ్యాంక్‌ అకౌంట్‌లో ఇప్పుడు 900 యూరోలు (సుమారు రూ. 80 వేలు) మాత్రమే ఉన్నాయని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ప్రైజ్‌మనీల ద్వారా వచ్చిన డబ్బు, ఐఓసీఎల్‌ కంపెనీ జీతం, మహా టెన్నిస్‌ ఫౌండేషన్‌ ఇచ్చే ఆర్థిక సహాయం మొత్తం టెన్నిస్‌లోనే పెడు తున్నానని, అయినా సరే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని వెల్లడించాడు. డబ్బులు లేకపోవడంతో ఫిజియో కూడా లేకుండా ఒకే ఒక కోచ్‌తో తాను పోటీల్లో పాల్గొంటున్నానని అన్నాడు.

టెన్నిస్‌ సర్క్యూట్‌లో నిలకడగా ఆడుతూ టాప్‌–100లో చేరాలంటే ఏడాదికి కనీసం రూ. 1 కోటి ఖర్చు అవుతుందని నగాల్‌ చెప్పాడు. ‘కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ భారత నంబర్‌వన్‌గా ఉన్నా నాకు కనీస మద్దతు కరువైంది. ప్రభుత్వం ‘టాప్స్‌’ పథకంలో నా పేరు చేర్చలేదు. డబ్బులు లేక జర్మనీలోనే టెన్నిస్‌ అకాడమీలో శిక్షణకు దూరమయ్యాను. నేను గాయపడి ఆటకు దూరమైనపుడు అసలు ఎవరూ నన్ను పట్టించుకోలేదు.

రెండుసార్లు కోవిడ్‌ రావడంతో ర్యాంక్‌ పడిపోయింది. మన దేశంలో ఆర్థికంగా మద్దతు లభించడం చాలా కష్టం. నా వద్ద ఉన్న డబ్బంతా ఆటకే పెడుతున్నా. గత రెండేళ్లలో ఏమీ సంపాదించలేదు. నేనేమీ ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో ఉండటం లేదు. అన్నీ కనీస అవసరాలే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పూర్తిగా చేతులెత్తేశాను’ అని నగాల్‌ తన బాధను చెప్పుకున్నాడు.