సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా వినాకయ చవితి పూజాకార్యక్రమం స్థానిక పిజిపి హాల్ నందు గణపతి నామ జయజయద్వానాల నడుమ ఎంతో భక్తిశ్రద్ధలతో , ఆద్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యంగా సుమారు 100 మంది బాలబాలికలు వారి స్వహస్తాలతో అరుదైన 21 పత్రాలతో బాలగణపతి పూజ చేసి వినాయక చవితి విశిష్ఠతను, సంప్రదాయాన్ని తెలుసుకొన్నారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజనంతరం వినాయకచవితి లడ్డు వేలం ఆసక్తికరంగాసాగగా వీర గ్రూపు లడ్డును దక్కించుకొంది.
ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ, పూజ లో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని అందించామని , అలాగే సుమారు 800 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచి తృప్తి చెందామని తెలిపారు. అందరూ సమాజం నిర్వహించే కార్యక్రమాలకు చేయూతనిస్తూ అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. ముందు ముందు మరిన్ని ఆకర్షనీయమైన కార్యక్రమాలు రూపొందిస్తూన్నామని, సభ్యులు కూడా ఆదరించాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకులు ఆలపాటి రాఘవ అందరికి ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన పూజా కార్యక్రమానికి సుమారు 500 ప్రత్యక్షంగా, 5000 మంది అంతర్జాలం ద్వారా వీక్షించడం జరిగిందని తెలిపారు. అందరి మంచికోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు , దాతలకు , పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలియజేసారు.