విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యతో తమిళ చిత్రసీమ తీవ్రమైన శోకంలో ఉంది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అంతకుముందే నటుడు మరిముత్తు మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాంటి సమయాల్లో వార్తాపత్రికలతో పాటు పలు యూట్యూబ్ చానెళ్ల కార్యకలాపాలు పలు వివాదాలకు కారణమయ్యాయి. దీంతో ప్రముఖుల మృతి ఘటనల్లో మీడియాను అనుమతించబోమని సంచలన నిర్ణయాన్ని కోలీవుడ్ తీసుకుంది.
కోలీవుడ్‌లో ఈ మధ్యే జైలర్ నటుడు మరిముత్తు గుండెపోటుతో మరణించారు. ఆ విషాదం మరిచిపోకముందే విజయ్ ఆంటోనీ కుమార్తె మరణించడంతో ఇండస్ట్రీతో పాటు పలువురిని కలచివేసింది. ఈ నేపథ్యంలో వారికి నివాళిలు పలువరు ప్రముఖులు అర్పించారు. ఆ సమయంలో తమిళ ప్రముఖ మీడియా ఛానల్స్‌తో పాటు యూట్యూబ్ సిబ్బంది వ్యవహరించిన తీరు తమిళనాట చర్చనీయాంశం అయింది. నివాళులర్పించేందుకు వచ్చే సెలబ్రిటీలతో పోటీపడి మైక్‌లు పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలకు తప్పుడు తంబ్‌నైల్స్ పెట్టి వ్యూవ్స్ కోసం పలు యూట్యూబ్ ఛానెల్‌లు పోటీపడ్డాయి.
ఈ నేపథ్యంలో ఇక నుంచి తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల మృతికి సంబంధించిన సంఘటనలకు మీడియాను అనుమతించబోమని నిర్మాతల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా ప్రకటన చేశారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే సమాజంలో ఈ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని ఆయన కోరారు. ఒక వ్యక్తి చనిపోతే ఎక్కువ నష్టం బాధిత కుటుంబానికే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీడియా వారికి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల అనుమతి ఉన్నా కూడా చనిపోయిన వారి ఇంటి వద్దకు ఎలాంటి మీడియా వారికి అనుమతి ఉండదని ఆయన ప్రకటించారు.