DailyDose

సీఐడీ కస్టడీకి చంద్రబాబు-నేరవార్తలు

సీఐడీ కస్టడీకి చంద్రబాబు-నేరవార్తలు

* విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచాడు. తోటి ప్రయాణికులను భయందోళనకు గురి చేశాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం గురువారం మధ్యాహ్నం గువహటి (Guwahati) నుంచి అగర్తల (Agartala)కు బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే అందులో ప్రయాణిస్తున్న బిస్వజిత్ దేబత్ (41) ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. విమానం అగర్తల ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కాగానే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు. పశ్చిమ త్రిపురలోని జిరానియాకు చెందిన దేబత్ కుంగుబాటు కారణంగా ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నించినట్లు విచారణలో తేలింది. ఆత్మహత్యాయత్నాన్ని ప్రయాణికులు అడ్డుకోగా.. వారితో అతడు గొడవ దిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

* సీఐడీ కస్టడీకి చంద్రబాబు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో.. చంద్రబాబు సీఐడీ కస్టడీకి అనుమతి. రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు. విచారణ ఎక్కడ చేస్తారు?.. జైల్లోనా? తటస్థ ప్రదేశంలోనా? అని సీఐడీకి జడ్జి ప్రశ్న. జైల్లోనే విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ. జైల్లోనే విచారించేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు. చంద్రబాబును విచారిస్తే.. స్కిల్‌ స్కాంలో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే ఛాన్స్‌.

* అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళ మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. అయితే, ఆమె మృతికి ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. రుర్కెలాలో అదనపు కలెకర్ట్‌ ఆఫీసులో రాజగంగపూర్‌ ప్రాంతానికి చెందిన సస్మిత మింజ్‌ (35) సహాయ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, పార్కులో ఉన్న జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఈ నెల 15న సస్మిత విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 17వ తేదీన ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. తల్లి, సోదరుడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా అందుకు ఆమె నిరాకరించారు. అయితే, కార్యాలయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోనని తెలిపారు.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ‘పిటిషన్‌ డిస్మిస్డ్‌’ అంటూ ఏకవాక్యంతో తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. ఇక 68 పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్‌ ఆర్డర్‌ కాపీలో ఏపీ హైకోర్టుల కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ కీలక దశలో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ఆపడం సరికాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్‌ను క్వాష్‌ చేయలేం.అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలి. ఎఫ్‌ఐఆర్‌లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి. విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయొచ్చు. విచారణలో ఎఫ్‌ఐఆర్‌ మెరిట్స్‌ మీద కేసును అడ్డుకోకూడదు. సీఆర్‌పీసీ 482 కింద దాఖలైన పిటిషన్‌పై మినీ ట్రయల్‌ నిర్వహించలేం. 2021 నుంచి 140 మందిని సీఐడీ విచారించింది. నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించింది. ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేం. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందు వల్ల మేం జోక్యం చేసుకోలేం’’ అని స్పష్టం చేసింది.

* సాయుధులైన కొందరు వ్యక్తులు ఒక ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Women Gang Raped) హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కత్తులు, పదునైన ఆయుధాలు కలిగిన నలుగురు వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి వేళ మహిళా కూలీల ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. అనంతరం కుటుంబ సభ్యుల ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లోని డబ్బు, నగలు దోచుకున్నారు. కాగా, అదే గ్రామంలో మరో ఇంటిపై కూడా ఆ వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతుల ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేసినట్లు తెలిపారు. ఒక వ్యక్తి నుంచి డబ్బులు, మొబైల్‌ ఫోన్‌ దోచుకున్నారని చెప్పారు. ఈ రెండు సంఘటనలపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.