Business

అంబానీకి భయం నేర్పించాలని చేశాడు

అంబానీకి భయం నేర్పించాలని చేశాడు

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కనిపించిన ఘటన రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించింది. అయితే, అంబానీల మదిలో భయాన్ని రేకెత్తించాలనే ఉద్దేశంతోనే మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే (Sachin Vaze) వాటిని పెట్టినట్లు విచారణలో తేలింది. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఐఏ కోర్టు.. నిందితుడు సచిన్‌ వాజేకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అంబానీ కుటుంబీకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే ప్రయత్నించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ వెల్లడించింది. ఈ క్రమంలో యాంటిలియా (అంబానీ ఇల్లు) సమీపంలో జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టినట్లు గుర్తించింది. అయితే, వాటిని డిటోనేటర్‌కు అమర్చలేదని ఎన్‌ఐఏ తెలిపింది. దీంతో ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి ఏఎం పాటిల్‌.. సచిన్‌ వాజేకు బెయిల్‌ నిరాకరిస్తూ సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించిన ఆర్డర్‌ కాపీలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి.