Business

వరుసగా నాలుగో రోజు నష్టాలు-వాణిజ్యం

వరుసగా నాలుగో రోజు నష్టాలు-వాణిజ్యం

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి పుంజుకొని మధ్యాహ్నం ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. అమ్మకాల ఒత్తిడితో చివరకు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ప్రభావం మార్కెట్లలో కనిపించింది. భారత్‌, కెనడా మధ్య పరిణామాలు, జేపీ మోర్గాన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్ల బాండ్‌ ఇండెక్స్‌లో భారత్‌ చేరనుండడం వంటి అంశాలు దేశీయ సూచీలపై మిశ్రమ ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 66,215.04 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,952.83 వద్ద కనిష్ఠాన్ని, 66,445.47 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 221.09 పాయింట్ల నష్టంతో 66,009.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,744.85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,798.65 వద్ద గరిష్ఠాన్ని, 19,657.50 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 68.10 పాయింట్లు నష్టపోయి 19,674.25 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.95 వద్ద నిలిచింది.

* దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో శుక్రవారం ఒక రేంజ్‌లో పుంజుకుంది. ఆరంభంలోనే 38 పైసలు పెరిగి 82.75 స్థాయిని తాకింది. చివరికి 19 పైసల లాభంతో 82.93 వద్ద ముగిసింది. గురువారం 2 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.

* వినాయక చవితి సందర్భంగా పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ మీద రూ. 20 తగ్గింది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 200 వరకు తగ్గినట్లు స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5,485 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5,984 వరకు ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ & 24 క్యారెట్ గోల్డ్ ధర వరుసగా రూ. 54850, రూ. 59840గా ఉంది. ఇదే ధర బెంగళూరు, గుంటూరు, విశాఖపట్టణం మొదలైన ప్రాంతాల్లో ఉంది. వెండి ధర ఒక గ్రాము రూ. 790 వద్ద నిలిచింది. కావున కేజీ వెండి ధర రూ. 79000. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 1000 పెరిగింది.

* భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆధునిక కార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ బ్రాండ్ ‘టెస్లా’ (Tesla) ఇండియాలో ప్రవేశించడానికి అనేకవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కంపెనీ ఇప్పుడు ‘బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ’ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులకు ముందు మన దేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సుమారు 24,000 డాలర్ల విలువైన ప్లాంట్ భారతదేశంలో నిర్మించడానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ & విక్రయం వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

* ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. అన్ని ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు వస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ ఇదే తరహా వ్యాపార సరళి కనిపిస్తోంది. ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారు హాప్(హెచ్ఓపీ) ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ పలు ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. హాప్ లియో, లైఫ్ మోడళ్లపై గణేష్ చతుర్థి సందర్భంగా డిస్కౌంట్లు ప్రకటించింది. లియో మోడల్ పై రూ. 4,100, లైఫ్ మోడల్ పై రూ. 3,100 తగ్గింపును తయారీదారు అందిస్తోంది. ఈ ఆఫర్ల సాయంతో పండుగల సీజన్లో అత్యధిక సేల్స్ రాబట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.